మన ఇంటి చిలుక మన పాటే పాడుతుంది… కానీ ఎదురింటి చిలక కూడా మన పాటే పాడాలని ఏపీలో అధికార వైఎస్సార్‌సీపీ, ప్రతిపక్ష టీడీపీలు రాజకీయంగా ఎత్తులు పైఎత్తులు వేస్తున్నాయి. అందుకు ఆ రెండు పార్టీలు బీజేపీలో చెరో చిలకను ఎంపిక చేసుకున్నాయి. టీడీపీ రాజ్యసభ సభ్యుడుగా ఉన్న సుజనా చౌదరిని తన చిలకగా చంద్రబాబు బీజేపీలోకి పంపగా… బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావును వైఎస్ జగన్ మచ్చిక చేసుకున్నారు. ఈ రెండు చిలకలు తమ పార్టీ పాట కాకుండా టీడీపీ, వైఎస్సార్‌సీపీ పాటలు పాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఒరవడికి తెరతీశాయి.
బీజేపీలో చంద్రబాబు బంటు సుజనా
టీడీపీకిగానీ ఆ పార్టీ అధినేత చంద్రబాబుకుగానీ రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతుందని తెలియగానే రాజకీయ తెరపైకి బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ప్రత్యక్ష మవుతారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి తరువాత బీజేపీలోకి చేరి సాంకేతికంగా ఆ పార్టీలో కొనసాగుతున్నా, ఆయన చంద్రబాబు వాదనను సమర్థిస్తూ ∙మాట్లాడతారు. పైగా అది బీజేపీ అభిప్రాయం అని కూడా చెప్పేస్తారు. టీడీపీ రాజకీయ విధానాలను ఆ పార్టీ నేతల కంటే సుజనా చౌదరే బలంగా వినిపిస్తుండటం గమనార్హం. రాజధానిగా అమరావతి కొనసాగించాలన్న వాదన విషయంలో టీడీపీ నేతల కంటే ఆయనే క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. మూడు రాజధానుల విధానం అమలు సాధ్యం కాదని ఆయనే చెప్పుకొస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు మద్దతుగా చంద్రబాబు తరపున మొత్తం వ్యవహారం నెరిపింది సుజనానే అన్నది బహిరంగ రహస్యం. బీజేపీలో ఉన్న చంద్రబాబు మద్దతుదారుడు కామినేని శ్రీనివాస్‌తో కలసి హైదరాబాద్‌లో ఓ స్టార్ హోటల్‌లో నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌తో కలసి మంతనాలు జరిపిన విషయం వీడియో సాక్ష్యాలతోసహా వెలుగులోకివచ్చింది కూడా. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా కూడా సుజనా గళం వినిపిస్తున్నారు. టీడీపీకి రాజకీయంగా ప్రయోజనం కలిగించే ఈ వ్యవహారాలన్ని కూడా బీజేపీలో ఉన్న సుజనా చౌదరి నిర్వర్తిస్తుండటం రాజకీయ వైచిత్రి.
వైఎస్సార్‌సీపీ చిలక- జీవీఎల్
చంద్రబాబును రాజకీయంగా బీజేపీ నుంచే ఎదుర్కోడానికి వైఎస్ జగన్‌కు దొరికిన అస్త్రం జీవీఎల్ నర్సింహరావు. బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగి రాజ్యసభ సభ్యుడైన ఆయన రాష్ట్ర రాజకీయాలపై వినిపించే వాదన అంతా వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉంటుందన్నది బహిరంగ రహస్యమే. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకున్న ఏదైనా విధాన నిర్ణయంపై కేంద్రం ఎలా స్పందిస్తుందోననే చర్చ మొదలవగానే …జీవీఎల్ ఠక్కున ప్రత్యక్షమవుతారు. ‘అబ్బే… ఇది కేంద్రానికి సంబంధించిన విషయం కాదు. రాష్ట్రం ప్రభుత్వ ఇష్టం’ అని తేల్చేస్తారు. దాంతో వైఎస్సార్‌సీపీకి ఎక్కడలేని ఊరట లభిస్తుంది.
టీడీపీ ఆరోపణలు, ఆ పార్టీ వేస్తున్న కేసులతో వైఎస్సార్‌సీపీకి ఇబ్బందికర పరిస్థితి తలెత్తినప్పుడు జీవీఎల్ తనదైన మాటల కనికట్టుతో ఆ సంక్లిష్ట స్థితిని సరళతరం చేసేస్తారు. మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయాన్ని కేంద్రం అడ్డుకుంటుందని టీడీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కానీ అదేమీ లేదు… రాజధాని అన్నది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం అని జీవీఎల్ కుండబద్దలు కొట్టేశారు. ఆయన చెప్పినట్టే కేంద్రం అదేవిషయాన్ని కోర్టుకు చెప్పింది కూడా.
చిలకలతో కీచులాటలు
ఈ పరిస్థితుల్లో బీజేపీ ఎంపీలు సుజనా చౌదరి, జీవీఎల్ నర్సింహరావు అసలు ఉద్దేశ్యం ఏమిటన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అందుకే వైఎస్సార్‌సీపీ నేతలు సుజనా చౌదరిని టార్గెట్ చేయగా… టీడీపీ నేతలు జీవీఎల్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. బీజేపీలో ఉన్న చంద్రబాబు కోవర్టు సుజనా అని వైఎస్సార్‌సీపీ నేతలు విమర్శల దాడి మొదలుపెట్టారు. వైఎస్ షర్మిల భర్త అనిల్‌కు జీవీఎల్ సమీప బంధువు అని పేర్కొంటూ టీడీపీ ప్రతిదాడి చేస్తోంది. ఇలా వైఎస్సార్‌సీపీ, టీడీపీ సోషల్ మీడియాలో పరస్పరం ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తూ రాజకీయాలను రక్తి కట్టిస్తున్నాయి.