అదో జాతీయ పార్టీ. కేంద్రంలోను , అనేక రాష్ట్రాల్లోను తిరుగులేని ఆధిక్యంతో పరిపాలన సాగిస్తూ ఆంధ్రప్రదేశ్ లోను తన ఉనికిని చాటుకునేందు ఉవ్విళ్లూరుతోంది. ఆ నేపథ్యంలోనే ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ‘కన్నా’ సమర్థవంతంగా తన బాధ్యతలను నిర్వహించడంలేదని , కొత్త అధ్యక్షునిగా వీర్రాజుకు వీరతాడు వేశారు. ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించే స్థితికి ఎదుగుతామని, వీలైతే 2024లో పవన్ కల్యాణ్ తో కలిసి అధికారంలోకి కూడా వచ్చేస్తామని ప్రకటించి పార్టీ కేడర్ ను ఉత్తేజితం చేశారు.
భారతీయ జనతాపార్టీ (బీజేపీ) రాష్ట్ర నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు గురువారం సాయంత్రం తొలిసారిగా విజయనగరం వచ్చారు. ఆ పార్టీ నాయకులతోను , కేడర్ తోను పిచ్చాపాటి మాట్లాడి వెళ్లిపోయారు. కనీసం మీడియాకు సమాచారం లేదు. స్థానికంగా ఒక రచయిత రాసిన పుస్తకావిష్కరణ ఫొటోలు బయటపడటంతో ఆయన వచ్చినట్లు తెలిసింది. ఇదేంటయ్యా మీడియాకు కనీసం సమాచారం లేదని ప్రశ్నిస్తే… ఏదో వచ్చారు, వెళ్లారు. మీకు చెబితే ఇంకేమైనా ఉందా అంటూ ఆ పార్టీకి చెందిన నాయకులే అంటుండటం విడ్డూరంగా ఉంది.
దీనంతటీకీ ఆ పార్టీలోని వర్గవిభేదాలు బయటపడతావనే భయమే కారణమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఉత్తరాంధ్ర పర్యటనలో గురువారం శ్రీకాకుళం లోను , శుక్రవారం విశాఖపట్నంలోను మీడియా సమావేశం నిర్వహించారు. విజయనగరంలో మాత్రమే మీడియా ముందుకు రాలేదు. మామూలుగా రాజకీయ నాయకులు మీడియా ప్రచారం కోరుకుంటారు. కొత్తగా రాష్ట్ర అధ్యక్ష పదవిలోకి వచ్చిన వ్యక్తి, ప్రతి జిల్లా తిరుగుతూ ఆ అంశానికి ప్రచారం కోరుకోవాలి. కానీ.. సోము వీర్రాజు మాత్రం చాలా భిన్నంగా అసలు మీడియాకు మొహం చాటేసి.. ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం ఎందుకు జరిగిందో.. ఆ మర్మం ఏంటో ఎంతకూ అర్థం కావడం లేదు.











