టాలీవుడ్ కు సీక్వెల్స్ గండం ఉన్న సంగతి తెలిసిందే. ఒక్క ‘బాహుబలి’ తప్ప తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకూ ఒక్క సీక్వెల్ మూవీ కూడా బతికి బట్ట కట్టిన దాఖలాలు లేవు. అయినా సరే.. గతంలో సూపర్ హిట్టయిన కొన్ని చిత్రాలకు సీక్వెల్స్ తెరకెక్కించే ఉత్సాహంలో ఉన్నారు పలువురు దర్శకులు. అయితే వీటిలో ఒక విశేషముంది. ఇవన్నీ థ్రిల్లర్ మూవీసే. అందులోనూ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్. ‘క్షణం, గూఢచారి, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, హిట్’ మూవీస్ ఆ లిస్ట్ లో ఉన్న చిత్రాలు. ఒక హత్యో, కిడ్నాపో జరగడం.. అవి ఎవరు చేశారో తెలియకపోవడం.. హీరో రంగంలోకి దిగడం.. కేస్ సాల్వ్ అవడం.. ఇదే వీటన్నిటి కాన్సెప్ట్.
గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లే, ఆసక్తికరమైన సన్నివేశాలు .. ఆశ్చర్యపరిచే క్లైమాక్స్ .. వీటిలోని హైలైట్ పాయింట్స్. అందుకే ఆ సినిమాలకు జనం ఓ రేంజ్ లో కనెక్ట్ అయ్యారు. ఈ అంశాలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఆయా దర్శక నిర్మాతలు వాటన్నిటికీ ప్రస్తుతం సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నారు. ఒక పాప కిడ్నాప్ ఉదంతంతో .. గ్రిప్పింగ్ కథాకథనాలతో రవికాంత్ పేరెపు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘క్షణం’ . అడివి శేష్, సత్యదేవ్, అదాశర్మ, అనసూయ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమా ప్రేక్షకులకి మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో స్పై అడ్వంచరస్ థ్రిల్లర్ గా రూపొందిన మరో సూపర్ హిట్ చిత్రం ‘గూఢచారి’.
అడివి శేష్ హీరోగానూ, శోభితా ధూళిపాళ ముఖ్యపాత్రలోనూ నటించిన ఈ మూవీలో జగపతి బాబు విలన్ గా నటించారు. శశికిరణ్ తిక్క దర్వకత్వంలో తెరెక్కిన ఈ మూవీ .. జనానికి హాలీవుడ్ సినిమా చూసిన అనుభవాన్నివ్వడం విశేషం. అలాగే ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ థ్రిల్లర్ మూవీ అసలే మాత్రం అంచనాలు లేకుండా.. పైగా కొత్త తారాగణంతో రూపొంది మంచి సక్సెస్ సాధించింది. నవీన్ పోలీశెట్టి , శ్రుతి శర్మ జంటగా నటించిన ఈ సినిమా ఇన్వెస్టిగేటివ్ మోడ్ లో .. డెడ్ బాడీస్ స్కామ్ తో డిఫరెంట్ స్ర్కీన్ ప్లేతో తెరకెక్కి ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్ పీరియన్స్ ను ఇచ్చింది.
అలాగే మరో నవయువ హీరో విశ్వక్ సేన్ నటించిన సూపర్ హిట్ థ్రిల్లర్ మూవీ ‘హిట్’. హోమిసైడ్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ అనే పూర్తి ఫామ్ కలిగిన ఈ సినిమా ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ మూవీగా చివరి వరకూ ఉత్కంఠత రేపుతూ .. ప్రేక్షకుల్ని చివరి వరకూ కూర్చోబెట్టింది. స్వరూప్ ఆరెస్ జే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కూడా హిట్ లిస్ట్ కెక్కేసింది. అలా.. ఈ సినిమాలన్నీ క్షణం2, గూఢచారి 2, ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ2, హిట్ 2 గా త్వరలో తెరకెక్కనుండడం టాలీవుడ్ లో ఆసక్తిగా మారింది. మరి వీటిలో ఎన్ని మూవీస్ టాలీవుడ్ ను సీక్వెల్ గండం నుంచి గట్టెక్కిస్తాయో చూడాలి.