మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోరు ముగిసింది. పంచాయతీ ఎన్నికలు పార్టీలకు సంబంధం లేకపోయినా, రాజకీయ పార్టీలు బలపరిచిన అభ్యర్థులే ఎక్కువగా సర్పంచ్ ఎన్నికల్లో దిగుతూ ఉంటారు. మొదటి విడత ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు 63 శాతం గెలుపొందారు. మొదటి విడత 2723 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పూర్తి చేశారు. ఇందులో వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు 1494 పదవులు కైవసం చేసుకున్నారు. టీడీపీ బలపరిచిన అభ్యర్థులు కూడా సత్తా చాటారు. మొదటి విడతలో జరిగిన ఎన్నికల్లో 1055 గ్రామాల్లో సర్పంచ్‌లుగా గెలిచి పట్టు నిరూపించుకున్నారు.
కోస్తా జిల్లాల్లో టీడీపీ హవా..
శ్రీకాకుళం జిల్లాలో 293 పంచాయతీలకు మొదటి విడత ఎన్నికలు జరగ్గా టీడీపీ బలపరిచిన అభ్యర్ధులు 118 గ్రామాల్లో విజయబావుటా ఎగుర వేశారు. ఇక వైసీపీ బలపరిచిన అభ్యర్థులు 153 గ్రామాల్లో గెలిచారు. విశాఖపట్నంలో 309 గ్రామాలకు గాను 144 పంచాయతీల్లో టీడీపీ, 149 పంచాయతీల్లో వైసీపీ అభ్యర్థులు గెలిచారు. తూర్పుగోదావరి జిల్లాల్లో 318 గ్రామాలకు గాను 132 టీడీపీ, 160 వైసీపీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. పశ్చిమగోదావరి జిల్లాలో 198 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా 87 టీడీపీ, 102 వైసీపీ బలపరిచిన అభ్యర్థులు సర్పంచ్‌లుగా గెలిచారు. ప్రకాశం, గుంటూరు, కృష్ణా, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోనూ టీడీపీ బలపరిచిన అభ్యర్థులు 346 మంది గెలిచారు. పశ్చిమగోదావరి జిల్లాల్లో జనసేన బలపరిచిన అభ్యర్థులు 18 పంచాయతీల్లో విజయం సాధించారు.
కోస్తాలో విశాఖ ఉక్కు ప్రైవేటు ప్రభావం
కోస్తా జిల్లాల్లో టీడీపీ సత్తా చాటుకుంది. ఎన్ని బెదిరింపులకు పాల్పడినా, అధికార పార్టీ అభ్యర్థులు లక్షలాది రూపాయలు ఖర్చు చేసినా టీడీపీని అడ్డుకోలేకపోయారు. దీనికి తోడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం అధికార పార్టీకి శాపంగా మారింది. స్థానిక ఎన్నికల్లో టీడీపీకి విశాఖ ఉక్కు అంశం బాగా కలసి వచ్చింది. కోస్తా జిల్లాలతోపాటు. అటు చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోనూ టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు గెలిచారు. దీంతో అధికార వైసీపీ నేతల్లో కలవరం మొదలైంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రభావం 2,3,4వ విడతల్లో జరగనున్న స్థానిక సంస్థలపై కూడా తీవ్ర ప్రభావం చూపనున్నాయి. దీంతో వైసీపీ నేతలు అలర్ట్ అయ్యారు. విశాఖ ఉక్కు ఉద్యమంలో ప్రతి రోజూ వైసీపీ నేతలు పాల్గొనాలని అధినేత ఆదేశించారని తెలుస్తోంది. దీంతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ విశాఖలో కార్మికులు చేస్తున్న ఉద్యమంలో ప్రతి రోజూ వైసీపీ అగ్రనేతలు పాల్గొంటున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకునే శక్తి సీఎం జగన్మోహన్‌రెడ్డికి మాత్రమే ఉందని వైసీపీ నేతలు జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.
అచ్చెన్న అరెస్టు వైసీపీకి తీరని నష్టం
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బెదిరింపులకు దిగారంటూ అక్రమంగా అరెస్టు చేయడంపై ఉత్తరాంధ్ర జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో టీడీపీ అభ్యర్థులు 44 శాతం పంచాయతీలను కైవసం చేసుకున్నారు. దీంతో అధికార వైసీపీ నేతల్లో కంగారు మొదలైంది. 94 శాతం పంచాయతీల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులే గెలిచారంటూ మంత్రి బొత్స ప్రకటనలు చేయడం ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. రాబోయే మూడు విడతల ఎన్నికల్లో విశాఖ ఉక్కు ఉద్యమం అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులను చావుదెబ్బతీసే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనా పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నేతలు ఊహించిన దానికన్నా మెరుగైన ఫలితాలు వచ్చాయనే చెప్పవచ్చు.