మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దీని తర్వాత మూడు చిత్రాలను ఓకే చేశారు. ఒకటి మలయాళ ‘లూసిఫర్’ రీమేక్. దీనికి మెహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలతో సినిమాని ప్రారంభించారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇక రెండో చిత్రం ‘వేదాళం’ రీమేక్. దీనికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఇక మూడవ సినిమాకి డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా ఉంటుందో ఉండదో అనుకున్నారు అయితే.. ఇటీవల ఉప్పెన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి బాబీతో సినిమా ను కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ఒక అప్ డేట్ వచ్చింది.
ఈ భారీ చిత్రంలో కథానాయికగా శ్రుతి హాసన్ కానీ, రకుల్ ప్రీత్ సింగ్ కానీ నటించే అవకాశం ఉందట. వీరిద్దరిలో ఒకర్ని త్వరలోనే ఎంపిక చేయనున్నారని టాక్. ఈ చిత్రానికి స్టార్ రైటర్ కోన వెంకట్ తో కలిసి పంతం మూవీ ఫేమ్ చక్రవర్తి మాటలు రాస్తున్నారని తెలుస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మే నెల నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. మరో విషయం ఏంటంటే.. ఈ భారీ చిత్రాన్ని 2022 సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి చిరు సరసన అవకాశాన్ని అందుకునే ముద్దు గుమ్మ ఎవరవుతారో చూడాలి.











