కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను సాధ్యమైనంతవరకు ప్రైవేటీకరిస్తామని, అందుకు వీలుపడని పక్షంలో మూసేస్తామని తేల్చి చెప్పారు. మంగళవారం రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన లిఖిత పూర్వక ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు.
టార్గెట్ 2.10 లక్ష కోట్లు..
‘2020-21 బడ్జెట్ సవరించిన అంచనాల ప్రకారం.. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.2.10 లక్షల కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంటే రూ.32వేల కోట్లే వచ్చాయి. కొవిడ్ కారణంగా ఏర్పడ్డ ప్రతికూల పరిస్థితులు పెట్టుబడుల ఉపసంహరణ దిశగా అడుగులు వేసేలా ప్రభావం చూపాయని తెలిపారు. ఇప్పుడు స్టాక్‌మార్కెట్ పుంజుకోవడంతో ఈ ప్రక్రియను మళ్లీ పట్టాలెక్కించాం.’
ఆత్మనిర్భర్ కోసమే పెట్టుబడుల ఉపసంహరణ..
‘ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి భారత్‌కు నిధులు కావాలి. అందుకే కేంద్రం కొత్త ప్రభుత్వరంగ సంస్థల విధానాన్ని ఖరారుచేసి అన్ని నాన్‌స్ట్రాటజిక్, స్ట్రాటజిక్ రంగాల్లో పెట్టుబడుల ఉపసంహరణకు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులో 4రంగాలను మాత్రమే స్ట్రాటజిక్ విభాగం కింద గుర్తించింది. ఈ సంస్థల్లో ప్రభుత్వ మనుగడ నామమాత్రమే. హోల్డింగ్ కంపెనీ మాత్రమే ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది. మిగిలిన వ్యవహారాలన్నీ ప్రైవేటీకరించడమో లేదంటే విలీనం చేయడమో, మరో ప్రభుత్వరంగ సంస్థకు అనుబంధంగా మార్చడమో.. లేదంటే మూసేయడమో జరుగుతుంది’ అని అనురాగ్ ఠాకూర్ తెలిపారు.











