వినోదరంగానికి ఈ ఏడాది చప్పగానే ఉందనుకోవాలి. కరోనా పుణ్యమా అని వినోదం కోసం ఓటీటీ వేదికల మీద ఆధారపడక తప్పలేదు.
గత ఏడాది సంక్రాంతికి ‘అల వైకుంఠపురములో’, ‘సరిలేరు నీకెవ్వరు’ లాంటి సినిమాలను పక్కన పెడితే దాదాపు అన్నీ ఓటీటీలకే పరిమితమయ్యాయి. మార్చిలో లాక్ డౌన్ తర్వాత సినిమా థియేటర్లు మూతపడటంలో ఓటీటీ విడుదల కోసం ప్రేక్షకులు ఎదురుచూడాల్సి వచ్చింది. అందువల్ల ఓటీటీ వేదికల్లో విడుదలైన తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్ లలో టాప్ 10 స్థానాల్లో ఏవి నిలిచాయో చూద్దాం. టాప్ 1, 2 స్ఠానాలను మాత్రం కలర్ ఫొటో, మిడిల్ క్లాస్ మెలోడీస్ దక్కించుకున్నాయి.
‘ఒరేయ్ బుజ్జిగా’ టాప్ 10
రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాని థియేటర్లలోనే విడుదల చేయాలనుకున్నారు. కరోనా కారణంగా ఓటీటీ విడుదల తప్పలేదు. ‘ఆహా’లో ఈ సినిమా విడుదలైంది. ఓటీటీలో విడుదల చేయాలనుకున్న నిర్ణయం లేటుగా తీసుకున్నా లేటెస్ట్ నిర్ణయం అయ్యింది. సరదాగా సాగిపోయే కథతో ఈ సినిమాని తెరకెక్కించారు. గుండెజారి గల్లంతయ్యిందే సినిమా తర్వాత విజయ్ కుమార్ కొండా ఈ సినిమాతో మరోసారి వినోదాత్మక ప్రయత్నం చేశారు.
‘హనీ మూన్’ టాప్ 9
ఈ కేటగిరీలో 9 వ స్థానంలో చోటు దక్కించుకున్న సిరీస్ హనీమూన్. సున్నితమైన కథను మంచి ఫీడ్ గుడ్ గా మలిచారు. నాగభూషణ, సంజనా ఆనంద్ లతో దీన్ని రూపొందించారు. కొత్త జంటలకు కావలసిన వినోదం ఇందులో ఉంటుంది. ఇది కూడా ఆహాతోనే జనం ముందుకు వచ్చింది.
‘గతం’ టాప్ 8
అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలైన ఈ సిరీస్ పేరు ‘గతం’. ఊహించని మలుపులతో ఇది సాగుతుంది. సరైన తారాగణం ఉంటే దీనికి ఇంకా మైలేజి ఉండి ఉండేది. ఓ విదేశీ చిత్రం స్ఫూర్తితో ఇది తెరకెక్కింది. తెలుగులో ఇది ఓ కొత్త ప్రయోగంగానే చెప్పాలి. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చే ఈ గతం టాప్ 8లో చోటు దక్కించుకుంది.
‘భానుమతి రామకృష్ణ’ టాప్ 7
నవీన్ చంద్ర, సలోనీ లుథ్రా నటించిన ‘భానుమతి రామకృష్ణ’ ఆహా ద్వారా స్ట్రీమింగ్ జరిగింది. దర్శకుడిగా శ్రీకాంత్ నాగోతి తొలి ప్రయత్నంతోనే ఆకట్టుకున్నాడు. తెనాలి నేపథ్యంతో ఈ సినిమా ముందుకు సాగుతుంది. ఓ ఊరికి సంబంధించిన కథ కావడంతో కథనానికి తాజాదనం చేకూరింది. మంచి ఫీల్ ఉండేలా రూపొందింది.
‘ఓటమి’ టాప్ 6
క్రీడా నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. జీ 5 ద్వారా దీని స్ట్రీమింగ్ జరిగింది. నటీనటులు బాగా ఆకట్టుకున్నారు. అన్నపూర్ణ కళాశాల పూర్వ విద్యార్థి అభిలాష్ రెడ్డి ఈ ప్రాజెక్టుకు సారథ్యం వహించాడు. క్రీడా నేపథ్యం అంటేనే స్ఫూర్తిదాయక కథ అవుతుంది. పైగా ఇది యూనివర్శల్ సబ్జెక్టు.
కృష్ణ అండ్ హిజ్ లీల టాప్ 5
నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమాకు మంచి స్పందన వచ్చింది. మంచి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా నిలిచింది. సిద్ధూ ప్రధాన పాత్ర ధారిగా ఈ సినిమా తెరకెక్కింది. ఒక విధంగా ఓటీటీలో తొలి విజయం ఈ సినిమాకే దక్కిందని భావించాలి. శ్రద్ధా శ్రీనాథ్, శాలిని వాడ్నికట్టి, సీరత్ కపూర్ నటన బాగుంది. క్షణం తర్వాత దర్శకుడు రవికాంత్ పేరేపుకు ఇది మరో మంచి సినిమాగా మిగిలింది.
‘మస్తిస్’ టాప్ 4
అందాలను ఆరబోయడం కోసమే మస్తిస్ వెబ్ సిరీస్ రూపొందినట్టుంది. దర్శకుడు క్రిష్ ఆహా కోసం ప్రత్యేకంగా దీన్ని రూపొందించారు. ఆహా ప్రారంభం నుంచి దీన్ని ప్రారంభించారు కాబట్టి పబ్లిసిటీ విషయంలోనూ వెనుకాడలేదు. అందుకే త్వరగా జనంలోకి వెళ్లిపోయింది. మోడ్రన్ సమాజానికి ప్రతీకగా ఈ సిరీస్ ఉంది.
‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ టాప్ 3
నెట్ ఫ్లిక్స్ ఖాతాలో ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ రూపంలో మరో హిట్ చేరింది. కరోనా కాలంలో మంచి వినోదాన్ని ఈ సినిమా అందించింది. మలయాళ చిత్రానికి ఇది రీమేక్ గా తెరకెక్కింది. ముఖ్యంగా హీరో సత్యదేవ్ ను ఈ సినిమా ఓటీటీ స్టార్ గా మార్చింది. ఈ సినిమా ద్వారా మరో మంచి నటుడు మనకు ఉన్నాడని సినిమా పరిశ్రమకు గుర్తుచేసినట్లయింది.
‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ టాప్ 2
మధ్యతరగతి జీవితాల్లో ఉండే మధురిమలను చక్కగా అందించిన సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్. ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ఈ సినిమాతో వినోద్ అనంతోజు అనే యువదర్శకుడు తెలుగు తెరకు పరిచయమయ్యాడు. గుంటూరు నేపథ్యంలో బొంబాయి చట్నీ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా గోపరాజు రమణ అనే మంచి నటుడిని కూడా అందించింది. ఇందులోని కొండల్రావ్ పాత్ర నేడు ట్రెండింగ్ గా మారింది. ఇందులోని చాలా పాత్రలను సహజత్వానికి దగ్గరగా దర్శకుడు తీర్చిదిద్దారు.
‘కలర్ ఫొటో’ టాప్ 1
ఈ కరోనా సమయంలో అతి పెద్ద హిట్ సినిమా ఏదైనా ఉంది అంటే అది కలర్ ఫొటో సినిమా గానే చెప్పాలి. సుహాస్, చాందినీ చౌదరి జంటగా సందీప్ రాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ‘ఆహా’ ఓటీటీకి బ్లాక్ బస్టర్ హిట్ అందించింది. మంచి ఫీల్ గుడ్ మూవీగా నెటిజన్ల ప్రశంసలు ఈ సినిమాకి దక్కాయి. అందుకే ఈ ఏడాది ఓటీటీలో అతి పెద్ద హిట్ స్థానం ఈ సినిమాకే దక్కింది. ముఖ్యంగా ఇందులో సునీల్ పాత్ర అందరినీ ఆకట్టుకుంది. టాప్ ఛైర్ ఈ కలర్ ఫొటోకే దక్కిందని అనడంలో అతిశయోక్తి లేదు.
– హేమసుందర్ పామర్తి
Also Read: OTT Will Not Give Theatre Experience | Tollywood Producer Tummala Prasanna Kumar Exclusive Interview











