సూపర్‌స్టార్ రజినీకాంత్ తన అభిమానులకు శుభవార్త చెప్పారు. తన రాజకీయ రంగ ప్రవేశం గురించి క్లారిటీ ఇచ్చారు. రజినీ అభిమాన సంఘాల జిల్లా అధ్యక్షులతో గంటన్నరపాటు చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఆ భేటీలో త్వరలో నిర్ణయం తెలుపుతామనని ప్రకటించిన రజినీ..ఎట్టకేలకు ట్వీట్ చేశారు. డిసెంబర్ 31న పార్టీ ప్రకటించనున్నట్లు, జనవరిలో పార్టీని ప్రారంభించనున్నట్లు రజినీకాంత్ వెల్లడించారు. కాగా 2021లోనే తమిళనాడులో ఎన్నికలు జరుగనున్నాయి.
తమిళనాట తీర్పులు విలక్షణం
సమీప కాలంలోనే ఎన్నికలు ఉండడం, రజనీ పార్టీ ప్రకటన నేపథ్యంలో రాజకీయంగా రజనీకాంత్ ఎంత ప్రభావం చూపుతున్నారనే చర్చ మొదలైంది. తెలుగు రాష్ట్రాలతో పోల్చితే తమిళనాట తీర్పులు విలక్షణంగా ఉంటాయి. ఈ కోణంలో ఆలోచిస్తే.. తమిళనాడు రాజకీయాల్లో ఎంజీఆర్ నుంచి రజనీ వరకు చాలామంది రాజకీయాల్లోకి వచ్చారు. కొందరు సక్సెస్ అయ్యారు. మరికొందరు విఫలమయ్యారు. విజయకాంత్‌ని తొలుత ప్రజలు 29 సీట్లతో ఆదరించినా.. తరువాత ఆయన తీసుకున్న నిర్ణయాలతో పార్టీ దాదాపు అస్తిత్వం కోల్పోవాల్సిన పరిస్థితికి వచ్చిందని చెప్పవచ్చు. ఇక రానున్న ఎన్నికల్లో తమిళనాడులో కమల్ పార్టీ, రజనీ పార్టీలు కొత్తగా ఉండనున్నాయి. ఇద్దరూ స్టార్ డమ్ ఇమేజ్ ఉన్నవారే. కాకపోతే..ఇక కమల్ పూర్తిగా నాస్తికుడు. ఆయన ఇప్పటికే ‘మక్కల్ నీది మయ్యం’ పార్టీ ఏర్పాటు చేశారు. ఇక రజినీ విషయానికి వస్తే ఆయన ఆస్తికుడు. వీరిద్దరి ప్రసంగాలు, ప్రకటనలు చూస్తే.. కమల్ డీఎంకే బాటలో ఉన్నారని చెప్పాల్సి ఉంటుంది. ఆ పార్టీ కూడా నాస్తికత్వానికి ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో కమల్ , డీఎంకేలు ఒకే రకమైన భావజాలంతో ఉన్నాయని చెప్పవచ్చు. ఇక రజనీకాంత్ విషయానికి వస్తే.. ఆస్తికుడు. అంతేకాదు.. ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి పరోక్షంగా సానుకూలంగా ఉండేలా ప్రకటనలు చేస్తున్నారు.
ఏఐఏడీఎంకేతో సావాసం..
రజనీకాంత్‌కి ఏఐఏడీఎంకేతో మంచి సంబంధాలే ఉన్నాయి. జయలలిత చనిపోయాక రజనీకాంత్ ఆ పార్టీ బాధ్యతలు స్వీకరిస్తారని ప్రచారం కూడా జరిగింది. అయితే శశికళ, దినకరన్‌ల వివాదం నేపథ్యంలో రజనీ దూరంగా ఉన్నారని చెబుతున్నారు. ఇప్పుడు కూడా ఆయన ఏఐఏడీఎంకేతో సత్సంబంధాలే నెరపుతున్నారు. మరోవైపు శశికళ వచ్చే జనవరి 27న విడుదల కానున్నారు. ఆమె విడుదల కూడా రాజకీయ సమీకరణాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇక ఏఐఏడీఎంకే, బీజేపీ కలసి తమిళనాడులో పోటీ చేయనున్న నేపథ్యంలో రజనీ విడిగా పోటీ చేస్తారా.. లేక వాటితో కలుస్తారా అనేది తేలాలి. ఇక తమిళనాడులో ప్రస్తుత పరిస్థితుల్లో ఓటర్లకు చాలా ఆప్షన్లు ఉన్నాయి. ఏఐఏడీఎంకే, డీఎంకే, కాంగ్రెస్, బీజేపీ, కమల, రజనీకాంత్ పార్టీలు ప్రధానంగా ప్రభావితం చేయనున్నారు. ఏఐఏడీఎంకే, బీజేపీ, రజనీకాంత్‌లు ఒకే తరహా వ్యాఖ్యలు చేయడం, గతంలో రజనీకాంత్ బీజేపీకి అనుకూలంగా మాట్లాడడం లాంటి సందర్భాలు చూస్తే.. రజినీకాంత్ పార్టీ.. వర్సెస్ డీఎంకే వర్సెస్ కమల్ పార్టీ అన్నట్లు రాజకీయం మారే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రజనీ, బీజేపీ, ఏఐఏడీఎంకేలు కలసి డీఎంకేను, కాంగ్రెస్‌ను దెబ్బకొట్టే వ్యూహాలను కూడా అమలు చేసే అవకాశం ఉంది.
కమల్‌తో స్నేహం..
తమిళనాడులో మరో ప్రముఖ నటుడు కమలహాసన్.. ఇప్పటికే పార్టీని కూడా స్థాపించారు. మక్కల్ నీది మయ్యం పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన కమలహాసన్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. ఆ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు లేకుండా సొంతంగానే బరిలోకి దిగుతామని అన్నారు. రజినీకాంత్ తమతో కలిసి వస్తే స్వాగతిస్తామని అన్నారు. కమల్‌కి, రజనీకాంత్‌కి 40 ఏళ్ల స్నేహం ఉన్న నేపథ్యంలో ఎన్నికల్లో వారి విమర్శలు ఎలా ఉంటాయనేది కూడా తేలాల్సి ఉంది.
Also Read: రాజకీయాల్లో రజినీకాంత్ వెనకడుగు ఖాయమా?











