గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరిగిన తీరు .. ప్రజల నుండి వచ్చిన రెస్పాన్స్‌పై కమలదళం ఫుల్ హ్యాపీగా ఉంది. షెడ్యూల్ విడుదలైన నాటి నుండి ఎన్నికల వరకు ఎక్కడ వెనక్కి తగ్గకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రచారంలో దూసుకు పోయాయి బీజేపీ శ్రేణులు. ప్రచారంలో కూడా ఆ పార్టీకి ప్రజల నుండి ఊహించని స్పందన వచ్చింది. ఇక టీఆర్ఎస్ వైఫల్యాలు కూడా ఆ పార్టీకి కిలిసి వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక పోలింగ్ మొదట్లో మందకొడిగా సాగినా చివరికి వచ్చే సరికి గత ఎన్నికల కంటే కొంత అధికంగానే పోలింగ్ పర్సెంటేజ్ నమోదు కావడంతో ఆ పార్టీ నేతలు తమకే అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు.
సర్కిల్ల వారీగా లెక్కలు
గ్రేటర్ ఎన్నికల్లో సర్కిల్ల వారీగా బీజేపీ నేతలు లెక్కలు తీస్తున్నారు. మందకొడిగా సాగిన పోలింగ్‌లో తమ కార్యకర్తలు తమ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఓటింగ్‌కు దగ్గరుండి పంపించారని తెలుస్తోంది. దీంతో కోర్ సిటీతో పోల్చితే నగర శివార్లలో ప్రజలు పోలింగ్ కోసం బారులు తీరడంతో వారంతా తమకు అనుకూలంగానే ఓటేసారన్న భావనలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో కనీసం 40 నుండి 50 సీట్లు తమకు వస్తాయని భావిస్తోంది. పోలింగ్ పర్సెంటేజీ ఓల్డ్ సిటీలో చాలా తక్కువగా నమోదైందని, అది తమకు అనుకూలమే అంటున్నారు ఆ పార్టీ నేతలు. హైదరాబాద్ ఎంపీ నియోజక వర్గంలో తమకు కనీసం తొమ్మది సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. గతంలో ఉన్న మూడు సీట్లకు మరో 6 అదనంగా వస్తాయని లెక్కలతో సహా చెబుతున్నారు.
సికింద్రాబాద్‌లో అధికంగా..
ఇక సికింద్రాబాద్‌లో అధికంగా సీట్లు వస్తాయని భావిస్తున్నారు. ఇక్కడ కనీసం 15సీట్లు తమకు వస్తాయని అంచనా వేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గం అయిన ఇక్కడ ఆయన పూర్తి స్థాయిలో కాన్సన్ ట్రేట్ చేశారు. షెడ్యూల్ రాక ముందు నుంచే అసెంబ్లీ నియోజక వర్గాలు, డివిజన్ల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి సమాయత్తం చేశారు. ఇక ప్రచారం కూడా ఆయన దగ్గరుండి నిర్వహించారు. దీంతో కిషన్ రెడ్డి ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఎల్బీనగర్ ,మహేశ్వరం పరిధిలో ఉన్న 13డివిజన్లలో కనీసం 9 వరకు తమకు వస్తాయని భావిస్తున్నారు. ఇక కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, పటాన్‌చెరులలో కనీసం 6 నుంచి 9 వరకు వస్తాయని భావిస్తున్నారు. దీంతో తాము మొదటి నుండి అనుకున్న సీట్ల కంటే ఎక్కవగానే సీట్లు వస్తాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, తమ పార్టీ నేతలు చేసిన విస్తృత ప్రచారం, ప్రజాకర్షక మైన మేనిఫెస్టో కారణంగా బీజేపీపై ప్రజలకు మంచి అభిప్రాయం ఏర్పడిందని… అదే తమకు అనుకూలంగా ఓటు వేసి విధంగా ఓటర్లను పోలింగ్ బూత్‌ల వైపు నడిపించిందంటున్నారు.
Must Read ;- రాష్ట్రంలో బీజేపీ ‘బండి’లాగే సమర్ధుడు సంజయుడే!











