చుట్టూ విమర్శలు.. కొత్తగా పార్టీలోకి వచ్చి మమ్మల్నే మించిపోతారా?అంటూ సెటైర్లు. ఇది గ్రాండ్ ఓల్డ్ పార్టీ.. ముందు పార్టీ నియమావళి నేర్చుకో అంటూ పాఠాలు. ఇక టీపీసీసీ చీఫ్ పదవి కోసం ప్రయత్నాలు చేసుకుంటూ సాగితే.. ఎక్కడికక్కడ అడ్డంకులు. ఆయనకు పదవి ఇస్తే.. రాజీనామాలు చేస్తామంటూ అధిష్టానానికి సీనియర్ల బెదిరింపులు. పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదులు. వీటన్నింటిని భరిస్తూ.. సహిస్తూ.. ఎట్టకేలకు తాను అనుకున్నది సాధించారు మల్కాజిరిగి ఎంపీ రేవంత్ రెడ్డి. పార్టీలో ఏ ఒక్కరి అండ లేకుండానే.. ఒంటరిగానే బరిలోకి దిగి టాప్ పోస్ట్ ను చేజిక్కించుకున్నారు. అయినా కూడా సీనియర్లు ఆయనతో కలిసి రావడం లేదు. ప్రతి అంశంపైనా ఫిర్యాదులే. విమర్శలే చేస్తున్నారు. అయినదానికీ, కానిదానికీ సీనియర్లంతా విమర్శలు సంధిస్తున్నారు. దూషణలనూ ఆశ్రయిస్తున్నారు. ఇవన్నీ కూడా రేవంత్ కు నష్టం చేయకపోగా.. ఏకంగా అంతకంతకూ ఆయనను బలోపేతం చేస్తున్నాయనే చెప్పాలి.
జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
సీనియర్ల విమర్శలను ఏమాత్రం పట్టించుకోకుండానే సాగుతున్న రేవంత్ రెడ్డిపై మరో సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే, కొత్తగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గానూ పదవీ బాధ్యతలు చేపట్టిన తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) విరుచుకుపడ్డారు. తనను క్రికెట్ మ్యాచ్‌కు పిలువలేదని… దండోరా సభలో మాట్లాడటానికి చాన్సివ్వలేదని జగ్గారెడ్డి ఫైరయ్యారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కావడానికి ముందే తాను మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యానని జగ్గారెడ్డి పేర్కొన్నారు. జహీరాబాద్‌లో క్రికెట్ మ్యాచ్ పెట్టి తనను పిలవలేదని… గజ్వేల్ సభలో మాట్లాడేందుకు చాన్సివ్వలేదని ఆక్రోశం వెళ్లగక్కారు. తాను కూడా పార్టీకి సంబంధం లేకుండా రెండు లక్షల మందితో సభ పెడతానని చాలెంజ్ చేశారు. ఈ వ్యాఖ్యాలు జగ్గారెడ్డికి మేలు చేయకపోగా.. రేవంత్ రెడ్డికి మంచి చేశాయి. పార్టీ చీఫ్ పై విమర్శలు చేస్తారా? అంటూ అధిష్ఠానం పెద్దలు జగ్గారెడ్డికి క్లాస్ పీకారట. దీంతో తప్పు దిద్దుకున్నట్లుగా 24 గంటల్లోనే లెంపలేసుకున్న జగ్గారెడ్డి.. తనదే తప్పని ఒప్పేసుకున్నారు. రేవంత్ ఇమేజీని మరింతగా పెంచేశారు.
కోమటిరెడ్డి, వీహెచ్‌లూ ఇలాగే
ఇక టీపీసీసీ చీఫ్ పదవి కోసం రేవంత్ తో హోరాహోరీ తలపడిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్టీకి చెందిన వృద్ధ నేత వి.హన్మంతరావులు కూడా రేవంత్ రెడ్డిపై ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. పీసీసీ చీఫ్ రేసు వరకైతే ఓకే గానీ.. అది ముగిశాక కూడా పీసీసీ చీఫ్ గా ఎంపికైన రేవంత్‌పై వారిద్దరూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతకాలానికి వీహెచ్ చల్లబడినా.. కోమటిరెడ్డి మాత్రం ఇంకా రేవంత్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ విమర్శల ద్వారా రేవంత్ బలం తగ్గకపోగా.. పార్టీ అధిష్ఠానం వద్ద ఆయన వెయిట్ అంతకంతకూ పెరుగుతోందనే చెప్పాలి. మరి ఈ విషయాన్ని రేవంత్ ప్రత్యర్థులు ఎప్పుడు గమనిస్తారో చూడాలి.