నారా చంద్రబాబునాయుడు నాయుడు.. తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగానే కాకుండా పదిహేనేళ్ల పాటు ముఖ్యమంత్రిగా, పన్నెండేళ్లకు పైబడి ప్రతిపక్ష నేతగా, మంత్రిగా, సుధీర్ఘకాలం పాటు ఓ పార్టీకి అధినేతగా.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలే ఉన్నాయి. తెలుగు నేల రాజకీయాల్లో ఓ సంచలనంగా, రాజకీయ వ్యూహాల్లో దిట్టగా.. ఏకంగా నాలుగు దశాబ్దాలకు పైగా చంద్రబాబును చెబుతారు. ఇటు తెలుగు నేల రాజకీయాలతో పాటు అటు జాతీయ రాజకీయాల్లోనూ తనదైఐ శైలి చక్రం తిప్పిన చంద్రబాబు గురించి చెప్పాలంటే.. గంటలు కాదు.. రోజులు కూడా సరిపోవేమో. అందుకే కాబోలు.. ఇప్పటికే చంద్రబాబు ప్రస్థానంపై లెక్కలేనన్ని పుస్తకాలు రాగా.. తాజాగా ఆయన ప్రస్థానమే ఓ పరిశోధనా విద్యార్థికి మూలంగా మారింది. చంద్రబాబు ప్రస్థానంపై పరిశోధనా పత్రాన్ని సమర్పించిన ఓ విద్యార్థికి పీహెచ్‌డీ పట్టా కూడా దక్కింది. వెరసి పుస్తకాలు దాటి పరిశోధనలకు మూలంగా మారిన చంద్రబాబు ప్రస్థానం త్వరలోనే పాఠ్యాంశంగా మారినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఏ రోల్ మోడల్..
రాజస్థాన్ లోని ఓపీజేఎస్ విశ్వవిద్యాలయంలో పరిశోధనా విద్యార్థిగా జాయిన్ అయిన సొంగా దేవదాస్ తన పరిశోధనకు చంద్రబాబు ప్రస్థానాన్ని ఎంచుకున్నారు. ‘నారా చంద్రబాబునాయుడుే రోల్ మోడల్’ పేరిట చంద్రబాబు రాజకీయాల్లో ఎంత ఎత్తుకు ఎదిగారన్న అంశాన్ని చెబుతూనే.. ఆ ప్రస్థానంలో చంద్రబాబు తన పేరిట లిఖించుకున్న రికార్డులను నమోదు చేశారు. పదిహేనేళ్ల పాటు సీఎంగా, పన్నెండేళ్లకు పైబడి ప్రతిపక్ష నేతగా, మంత్రిగా, సుధీర్ఘకాలం పాటు ఓ పార్టీకి అధినేతగా.. ఇలా సాగిన చంద్రబాబు 40 ఏళ్ల ప్రస్థానాన్ని దేవదాస్ తన పరిశోధనా పత్రంలో పొందుపరిచారు. రాష్ట్ర రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు నెరపిన మంత్రాంగం.. ఆ ఫలితంగా ఏపీజే అబ్దుల్ కలాం వంటి శాస్త్రవేత్తలు రాష్ట్రపతి పీఠాన్ని అధిరోహించిన తీరు.. ఇలా చంద్రబాబు ప్రస్థానంలోని కీలక ఘట్టాలన్నింటిని అందులో ప్రస్తావించారు. గురువారం నాడు ఈ పరిశోధనా పత్రాన్ని సమర్పించగా.. యూనివర్సిటీ ఆయనకు డాక్టరేట్ ను ప్రదానం చేసింది. ఈ అంశం తెలుగు నేల రాజకీయాల్లో వైరల్ గా మారిపోయింది.
ఎవరీ రీసెర్చి స్టూడెంట్..?
సోంగా దేవదాస్.. వేరే ప్రాంతానికి చెందిన వారేమీ కాదు. తెలుగు నేల..అందులోనూ ఏపీలోని కృష్ణా జిల్లా.. విజయవాడకు అత్యంత సమీపంలోని గన్నవరం నియోజకవర్గ పరిధిలోని ఆత్కూరు గ్రామానికి చెందిన సోంగా దేవదాస్ చాలా కాలం క్రితమే జార్ఖండ్ లోని రాంచీలో స్థిరపడ్డారు. ఈ క్రమంలో రాజస్థాన్‌లోని ఓపీజేఎస్ విశ్వవిద్యాలయంలో పరిశోధనా విద్యార్థిగా నమోదైన సోంగా దేవదాస్.. తన పరిశోధనకు చంద్రబాబు రాజకీయ ప్రస్థానాన్ని ఎంచుకున్నారు. అంతేకాకుండా చంద్రబాబు రాజకీయ ప్రస్థానంపై తాను సమర్పించిన పరిశోధనా పత్రానికి డాక్టరేట్ కూడా సంపాదించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే ఏపీకి వస్తానని, చంద్రబాబు ప్రస్థానంపై తాను సంపాదించిన డాక్టరేట్ ను తీసుకుని చంద్రబాబును కలుస్తానని చెప్పారు.