అసలే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత స్థాయిలో రచ్చ సాగుతోంది. ఈ రచ్చను సీఎం జగన్ సముదాయిస్తారనుకుంటే.. ఆ మంటలకు పెట్రోల్ యాడ్ చేసిన చందంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేపైకి మరింత దూకుడుగా వెళ్లండి అంటూ మాజీ ఎమ్మెల్యే కుటుంబానికి ఏకంగా జిల్లా పరిషత్ చైర్మన్ గిరీని కట్టబెట్టేశారు. ఇదీ ప్రకాశం జిల్లా వైసీపీలో చోటుచేసుకున్న కొత్త పరిణామం. అసలే కొట్టుకుచస్తున్న పార్టీ వర్గాల మధ్య మరింత ఆజ్యం పోసేలా ఎమ్మెల్యే ప్రత్యర్ధి వర్గానికి కీలక పదవి ఇవ్వడం ద్వారా జగన్ ఏలాంటి సంకేతాలు ఇస్తున్నారన్నదానిపై ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతోంది.
బూచేపల్లికి బూస్టింగే
బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆది నుంచి జగన్ వెంట నడిచిన అతి కొద్దిమందిలో ముందువరుసలో ఉన్న నేత కిందే లెక్క. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచి కూడా బూచేపల్లి కుటుంబం వైఎస్ ఫ్యామిలీతో అత్యంత సన్నిహితంగానే మెలగింది. ఈ రెండు కుటుంబాల మధ్య బంధుత్వం కూడా ఉంది. అయితే ఎందుకనో గానీ.. 2019 ఎన్నికల్లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎన్నికల బరిలోకి దిగలేదు. జగన్ టికెట్ ఇవ్వలేదో, బూచేపల్లినే వద్దన్నారో తెలియదు గానీ.. బూచేపల్లికి టికెట్ దక్కలేదు. దర్శి స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రముఖ వ్యాపారవేత్త, జనసేన మాజీ నేత మద్దిశెట్టి వేణుగోపాల్ విజయానికి బూచేపల్లి కృషి చేశారు. అనుకున్నట్లుగానే మద్దిశెట్టి గెలిచారు కూడా. అయితే ఆ తర్వాత మద్దిశెట్టి.. బూచేపల్లి వర్గాన్ని దూరం పెట్టడం మొదలెట్టారట. మొన్నటిదాకా సైలెంట్ గానే ఉన్న బూచేపల్లి ఇటీవలే మళ్లీ యాక్టివేట్ అయ్యారు. మద్దిశెట్టి ఒకటి అంటే.. బూచేపల్లి రెండు అంటున్నారు. ఇప్పుడు దర్శి కేంద్రంగా జరుగుతున్న వీరి పోరు ప్రకాశం జిల్లాను దాటిపోయి ఏపీ వ్యాప్తంగా వైరల్ గా మారిపోయింది. ఇలాంటి నేపథ్యంలో ఎమ్మెల్యే టికెట్ ను వదులుకున్నారన్న భావనతో బూచేపల్లి ఫ్యామిలీ పట్ల సానుభూతి చూపిన జగన్.. ప్రకాశం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవిని బూచేపల్లి కుటుంబానికి కేటాయించారు. శివప్రసాద్ రెడ్డి తల్లి బూచేపల్లి వెంకాయమ్మ శనివారం నాడు ప్రకాశం జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు.
మద్దిశెట్టి తగ్గక తప్పదా?
బూచేపల్లి ఫ్యామిలీతో జగన్ కు గట్టి సంబంధ బాంధవ్యాలే ఉన్నాయి. ఒకే సామాజిక వర్గం, తన వెన్నంటి నడిచిన వైనం, అందకుమించి బంధుత్వం తదితరాలు బూచేపల్లిని జగన్ కు అత్యంత సన్నిహితుడిగానే మలిచేశాయి. ఇలాంటి నేపథ్యంలో ఈ లెక్కలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా తనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న బూచేపల్లి ఫ్యామిలీనే ఇబ్బంది పెట్టాలని చూస్తే.. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ను జగన్ ఉపేక్షించే సమస్యే లేదు కదా. అందుకే బూచేపల్లి, మద్దిశెట్టి మధ్య నెలకొన్న వివాదంపై ఒక్క మాట కూడా మాట్లాడని జగన్.. ఏకంగా బూచేపల్లి ఫ్యామిలికి జడ్పీ పీఠాన్ని అప్పగించడం ద్వారా మద్దిశెట్టికి తన మనసులోని మాట ఏమిటో చెప్పేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. జడ్పీ చైర్మన్ అంటే.. కేబినెట్ ర్యాంక్ కు సరిసమాన హోదా కలిగిన పదవి. అలాంటి పదవిలో బూచేపల్లి ఫ్యామిలీ కూర్చుంటే.. ఇక మద్దిశెట్టి చేసేదేముంది? ప్రత్యామ్నాయం చూసుకోవడం మినహా మరే మార్గం లేదు కదా అన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.











