తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయం గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉంది. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్న కాలంలోనే ఈ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ కార్యాలయ భవనం నిర్మాణమే అక్రమం అంటూ ఇప్పుడు, వైసీపీ ఎమ్మెల్యే, కోర్టు కేసులు నడపడంలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఏకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.
వాగు పోరంబోకు స్థలంలో అక్రమంగా టీడీపీ కార్యాలయం నిర్మాణం చేపట్టారని పిటిషన్ లో రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. గతంలో ఇదే విషయంమీద రామక్రిష్ణారెడ్డి హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. అప్పట్లోనే.. దానిని హైకోర్టు కొట్టేసింది.
ఆ హైకోర్టు ఉత్తర్వులను ఇప్పుడు రామక్రిష్ణా రెడ్డి సుప్రీంలో సవాల్ చేశారు. టీడీపీ కార్యాలయం అక్రమం అంటూ తాజాగా సుప్రీంను ఆశ్రయించారు.
దీనిని విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు టీడీపీకి, ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో విచారణ చేపడతామని సుప్రీంకోర్టు పేర్కొంది.
టీడీపీ ఆఫీసును కూలుస్తారా?
అక్రమ నిర్మాణం అని నిరూపించడానికి ఏ చిన్న ఆధారం దొరికినా చాలు.. ఆ వెంటనే దానిని కూల్చివేయడానికి ఏపీ ప్రభుత్వం చాలా ఉత్సాహపడుతున్న సంగతి చాలా ఉదాహరణల ద్వారా మనకు అర్థమవుతూనే ఉంది. జగన్మోహన రెడ్డి పరిపాలనలోకి రాగానే.. మొట్టమొదటగా చంద్రబాబు ఉండవిల్లి ఇంటికి సమీపంలో నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయడం తోనే తన కార్యకలాపాలు ప్రారంభించారు.
విశాఖపట్టణంలో అయితే ఇటీవలి కాలంలో వరుస కూల్చివేతలు ఒక ఉద్యమంలాగా సాగుతున్నాయి. అవన్నీ తెలుగుదేశం నాయకులకు చెందిన ఇళ్లే కావడం విశేషం. తెలుగుదేశం వారిపై ప్రభుత్వం కక్ష కట్టినట్టుగా వ్యవహరిస్తూ ఇళ్లు కూలుస్తోందని ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అయితే టీడీపీ రాష్ట్ర కార్యాలయం జోలికి మాత్రం రాలేదు.
అయితే, ఈ విషయంలో తమ చేతికి మట్టి అంటకుండా.. న్యాయవ్యవస్థ ద్వారానే అలాంటి సూచన వచ్చేలా పావులు కదపడానికి ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం కౌంటర్ దాఖలు చేయమని అడిగితే గనుక.. ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వ వాదన, వారు వేసే కౌంటర్.. వైసీపీ ఎమ్మెల్యే రామక్రిష్ణా రెడ్డి వాదనకు అనుకూలంగానే ఉంటాయి. అలా జరిగేట్లయితే.. అది పూర్తిగా వాగు పొరంబోకులోనే ఉన్నట్లుగా ప్రభుత్వం పక్కా ఆధారాలను సుప్రీం కోర్టుకు సమర్పించవచ్చు.
వాటిని బట్టి సుప్రీం నుంచి టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని కూల్చివేయడానికి అనుకూలంగా తీర్పు రావొచ్చు. లేదా.. ఆధారాలు సుప్రీంకు ఇచ్చిన తర్వాత.. ఏదో ఒక శుభముహూర్తం చూసుకుని, మంచి అర్ధరాత్రి వేళ ఆ ఆఫీసును ప్రభుత్వం కూల్చివేయనూ వచ్చు అని ప్రజలు అనుకుంటున్నారు. టీడీపీ నాయకుల ఇళ్ల సంగతి అంతు తేలుస్తున్న ప్రభుత్వం.. నెమ్మదిగా వారి రాష్ట్ర కార్యాలయం మీద కూడా కన్నేస్తున్నదనే అనిపిస్తోంది.