దుబ్బాక ఉప ఎన్నికల్లో పంచేందుకు తెచ్చిన డబ్బులు సిద్దిపేటలోని రఘునందన్ రావు మామ ఇంట్లో ఉన్నాయంటూ పోలీసులు నిర్వహించిన సోదాలు కలకలం రేపాయి. ఈ సందర్భంగా పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారని బీజేపీ శ్రేణులు పేర్కొంటూ వారిపై చర్యలకు సంబంధిత ఉన్నతాధికారులను కోరుతున్నాయి. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా బలవంతంగా ఇంట్లోకి చొరబడి సోదాలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తాము తెచ్చిన డబ్బులు ఇంట్లో పెడుతూ పోలీసులు అడ్డంగా దొరికి పోయారని, ఇది పోలీసులు ఆడిన నాటకమని వారు ఆరోపిస్తున్నారు.
ఆ సంచిలో డబ్బులు ఎక్కడివి..?భయమా? బీజేపీ రఘును అంతగా టార్గెట్ చేస్తున్నారే..!
పోలీసులు ఒక్కసారిగా సిద్దిపేటలోని రఘునందన్ రావు ఇంట్లో చొరబడి మూడు నుంచి నాలుగు గంటల పాటు సోదాలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. ఓ పోలీస్ కానిస్టేబుల్ సంచి మూటతో అటూ ఇటూ తిరుగుతుండగా కార్యకర్తలు ఆయన వద్ద ఉన్న సంచిని లాక్కునేందుకు ప్రయత్నించి అందులో ఏముందో చూపించాలంటూ ఒత్తిడి తెచ్చారు. పోలీసులు నిరాకరించడంతో బలవంతంగా సంచిని తెరవగా పెద్ద ఎత్తున డబ్బులు బయట పడటంతో వాటిని బీజేపీ కార్యకర్తలు మీడియాకు చూపించారు. అవి ఇంట్లో దొరికిన డబ్బులయితే సంచిలో మూట కట్టాల్సిన అవసరం ఏముందంటున్నారు. పోలీసులే డబ్బుల తెచ్చి వారి ఇంట్లో పెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తున్నారు.
చిన్న పిల్లాడిని కూడ పక్కకు తప్పించి..
నోటీసులు ఇవ్వకుండా సోదాలు చేయడం ఓ తప్పయితే.. మంచంపై పడుకున్న చిన్న పిల్లాడిని కూడ పక్కకు తప్పించి తనిఖీలు చేయడం పట్ల తవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇంటిలో మహిళలపై కూడా చేయి చేసుకున్నంత పనిచేసి భయభ్రాంతులకు గురిచేసేలా పోలీసులు వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, తమ బంధువుల ఇంట్లో డబ్బులే దొరకలేదని పోలీసులతో చెప్పించిన రఘునందర్ రావు ,బీజేపీ కార్యకర్తలు ఎందుకంత సీరియస్ ఇష్యూ చేస్తున్నారని టీఆర్ఎస్ వారు అంటున్నారు. దొంగే దొంగ అన్నట్టు వారు వ్యవహరిస్తున్నారని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు.
సీఎం ఫాం హౌజ్‌లో ఇలాగే సోదాలు చేస్తారా..
రఘునందన్ రావు మామ ఇంట్లో పోలీసుల సోదాలు చేసిన తీరుపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది. ముఖ్యనేతలందరూ దీన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇదే తరహాలో దుబ్బాక నియోజకవర్గం పక్కనే ఉన్న సీఎం కేసీఆర్ ఫాం హౌజ్‌లో సోదాలు నిర్వహిస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ ఫాం హౌజ్‌లో కోట్ల రూపాయలు ఉన్నాయని, దుబ్బాకలో ఓటర్లను ప్రలోబపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.