డిజిటల్ ప్లాటుఫామ్స్ అనేవి గత రెండు మూడేళ్ళ నుంచి ఉన్నా , సగటు ప్రేక్షకుడికి బాగా చేరువైంది ఈ కరోనా కాలంలోనే. థియేటర్స్ మూత పడ్డాక ఓటీటీ వేదికలకు నెలవారీ చందానో, ఏడాది చందానో కట్టి .. బహు భాషా చిత్రాలు చూస్తూ ప్రేక్షకులు సంతృప్తి చెందుతున్నారు. తమ ప్రాంతీయ భాషా చిత్రాల కోసం తపించిపోయే వారి కోసం తెలుగులో ‘ఆహా’వచ్చినట్లే బెంగాలీలో ‘ హొయిచోయ్’ అనే డిజిటల్ వేదిక ఉంది. మిగిలిన చిత్ర పరిశ్రమల వాళ్ళు డిజిటల్ వేదికలు సృష్టించుకోవడానికి ఇష్టపడలేదు. త్వరలోనే కరోనా సమస్య తీరి , థియేటర్స్ తెరుచుకుంటాయని ఆశగా ఎదురుచూస్తున్నారు.
అక్టోబర్1 నుంచి దేశ వ్యాప్తంగా థియేటర్స్ ఓపెన్ చేయబోతున్నారు . ఏడాదికి 2-3 వేల ఖర్చుతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమాలను ఇంటిలో కూర్చుని చూడటం అలవాటు అయిన ప్రేక్షకుడికి ఓ కంఫర్ట్ అలవాటు అయింది. కరోనా భయం పోయి , ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడి, థియేటర్స్ లోనే చూడాలని టెంప్ట్ చేసే, సినిమాలు రిలీజ్ అయినప్పుడు ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తారు. ఇది ప్రేక్షకుల పాయింట్ అఫ్ వ్యూ అయితే డిజిటల్ ప్లాటుఫార్మ్స్ ఆలోచనలు వేరేగా ఉన్నాయి కోట్లాది రూపాయిలు ఖర్చు పెట్టి కొత్త సినిమాలు కొంటున్నా కొత్త చందాలు పెరగడం లేదు. అందుకే ప్రముఖ ఓటీటీ వేదికలు ఏటీటీలలోకి దిగుతున్నారు.
ఏటీటీ అంటే ఎనీ టైం థియేటర్ అని అర్ధం. రామ్ గోపాల్ వర్మ సినిమాలు కొన్ని ఈ పద్దతిలో విడుదలైనవే. ఇప్పుడు జీ సంస్థ కొత్తగా జీప్లెక్స్ అనే యాప్ ను ప్రారంభించింది. ఇది పే ఫర్ వ్యూ పద్దతిలో నడవబోతోంది. విదేశాల్లో ఈ పద్దతి సర్వ సాధారణం. కొన్నేళ్ల క్రితం విశ్వరూపం సినిమా విడుదలైన సమయంలో కమలహాసన్ ఇటువంటి ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు అందరూ వ్యతిరేకించారు. ఇప్పుడు జీ ప్లెక్స్ లో మొదటిసారి ఓ తమిళ సినిమా ‘ రణ సింగం ‘ ఇలా విడుదల కాబోతుంది. విజయ్ సేతుపతి , ఐశ్వర్యా రాజేష్ నటించారు ఈ సినిమాలో. అలాగే తెలుగులో కూడా, ఓ యువ హీరో నటించిన సినిమా కూడా జీప్లెక్స్ లో పే ఫర్ వ్యూ పద్దతిలో రిలీజ్ కాబోతోందని వార్తలు వస్తున్నాయి
ప్రేక్షకుడు వంద, రెండు వందలు చెల్లించి టికెట్ కొనుకున్నట్లే ఈ పే ఫర్ వ్యూ కి కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఎంతమంది చూస్తారన్నది ఆట మొదలైతే కానీ తెలియదు. థియేటర్ ఓనర్ నుంచి, డిస్ట్రిబ్యూటర్ నుంచి కలెక్షన్స్ రిపోర్ట్స్ తెప్పించుకుని నిర్మాత లెక్కలు తేల్చుకున్నట్లే. ఇప్పుడు డిజిటల్ వేదికల నుంచి రెవిన్యూ రిపోర్ట్స్ తెప్పించుకుని నిర్మాత తన వాటా ఎంత వస్తుందో అంచనా వేసుకోవాలి. ఇది కాకుండా ఓటీటీ వేదికల దగ్గర మరో ఆప్షన్ ఉంది. అవుట్ రేట్ కి కొనకుండా రెవెన్యూ షేరింగ్ అనేది. అంటే గంట నిడివి సినిమాని ఎంతమంది చూశారు అనే దాన్ని బట్టి లెక్కగట్టి నిర్మాతకి డబ్బులు ఇస్తారు. రెండు గంటల సినిమా పూర్తిగా కోటిమంది చూస్తే రెండు కోట్ల మంది చూసినట్లు లెక్క.
ఒకవేళ గంటలోపల ఆ సినిమా నచ్చక, 20 నిమిషాలకు వేరే సినిమాలోకి వెళ్ళిపోతే డబ్బులు ఇవ్వరు. పూర్తిగా సినిమా చూడటం ముఖ్యం . ప్రతి నిమిషం రక్తి కట్టేలా సినిమా తీయడం దర్శక నిర్మాతల బాధ్యత. లేకపోతే డబ్బులు రావు.
పే ఫర్ వ్యూ లో కూడా మొదటి ఆటకి సినిమా బాగోలేదని టాక్, రివ్యూస్ వస్తే మిగిలిన వాళ్ళు డబ్బులు చెల్లించి సినిమా చూడటం కష్టం. ఈలోగా పైరసీ వచ్చే ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఇది కరోనా మేకర్స్ మీద మరింత ఒత్తిడి పెంచింది. ప్రపంచ సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే కంటెంట్ మేకింగ్ లో క్వాలిటీ ఉన్న సినిమాలే తీయాలి.. వేరే మార్గాలేమీ లేవు.











