తెలంగాణలో శనివారం మధ్యాహ్నం దారుణం చోటుచేసుకుంది. పంట పొలాల్లో ఓ వ్యక్తి, అతడి ఇద్దరు కుమారులు… మొత్తంగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. ఫ్యాక్షన్ కక్షల్లో జరిగే హత్యల మాదిరిగా గొడ్డళ్లతో ఈ ముగ్గురిని వారి ప్రత్యర్థులు అత్యంత పాశవికంగా నరికారు. ఈ ఘటనలో బాధితులు ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
పంట పొలంలోనే నరికివేత
తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం గ్రామ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితులు తమ పొలంలో పనులకు వెళ్లగా… వారి ప్రత్యర్థులు కూడా అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వాగ్వాదం కాస్తా చిలికిచిలికి గాలి వానలా మారగా… ప్రత్యర్థులు బాధితులపై మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడికి దిగారు. ఈ దాడిలో తీవ్ర గాయాలైన బాధితులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మృతులను మంజూనాయక్, సారయ్య, భాస్కర్ లుగా గుర్తించారు. ఘర్షణ జరిగిన తీరు చూస్తుంటే… ప్రత్యర్థులు ముందస్తు ప్రణాళిక ప్రకారమే నిందితులపై చేసినట్లుగా తెలుస్తోంది.
Must Read ;- రెండేళ్లలో 30 మంది టీడీపీ నేతల హత్య.. వైసీపీపై చంద్రబాబు ఫైర్











