వైసీపీ అధికారం చేపట్టిన తొలి రెండేళ్లలోనే రాష్ట్రవ్యాప్తంగా 30 మంది టీడీపీ నేతలకు హత్యకు గురయ్యారని టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని బట్టి చూస్తే వైసీపీ హత్యా రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తోందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారం చేతిలో ఉంది కదా అని… వైసీపీ ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, తమ అక్రమాలను అడ్డుకుంటున్నారనే నెపంతో టీడీపీ నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ హత్యా రాజకీయాలను ఇక ఎంతమాత్రం సహించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయిలో గురువారం ఉదయం జరిగిన వడ్డు నాగేశ్వరరెడ్డి, వడ్డు ప్రతాప్ రెడ్డిలు వైసీపీ నేతల చేతిలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్యలపై స్పందించిన చంద్రబాబు… వైసీపీ సర్కారు తీరుపై విరుచుకుపడ్డారు.
రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందా?
రాష్ట్రంలో పట్టపగలే తెలుగుదేశం కార్యకర్తలను హతమారుస్తున్నారని, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణిస్తున్నాయని చెప్పేందుకు ఇదే నిదర్శనమని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హత్యల వెనుక వైసీపీ కీలక నేత, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అసలు పోలీసు వ్యవస్థ పని చేస్తుందో లేదో అనుమానం కలుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడవలసిన పోలీసులు, అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇటువంటి ఫ్యాక్షనిజం పోకడలతో ఎలాంటి సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారు అని వైసీపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారు.
దేశంలో ఎక్కడా ఈ పరిస్థితి లేదు
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు… రెండేళ్లలోనే 30 మంది టీడీపీ కార్యకర్తలను హతమార్చారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న హత్యాకాండకు వైసిపి ప్రభుత్వానిది, పోలీసులది బాధ్యత అని చంద్రబాబు పేర్కొన్నారు. దేశంలో మరెక్కడా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదన్నారు. రాబోయే రోజుల్లో ఈ దారుణాలు అన్నింటికీ వైసీపీ నేతలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి అంటూ చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.
కార్యకర్తలకు అండగా పార్టీ
టీడీపీ కార్యకర్తలు, నేతలు ఎవరూ భయాందోళనకు గురి కావద్దని చంద్రబాబు అభయం ఇచ్చారు. పార్టీ శ్రేణులకు ఎల్లప్పుడూ పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే… ఇద్దరు టీడీపీ నేతల హత్యతో పెసరవాయి గ్రామంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. కర్నూలు జిల్లా టీడీపీ నేతలు బాధిత కుటుంబాలను పరామర్శించారు. గ్రామంలో ప్రతీకార దాడులు జరగకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Must Read ;- చంద్రబాబు మెతక వైఖరి వీడితే… ఏ ఒక్కరూ మిగలరు : వైసీపీ ప్రభుత్వంపై గౌతు శీరిష ఫైర్










