ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ఇప్పుడు ఓ కొత్త వివాదం రాజుకుంది. ఈ వివాదం వైసీపీ, బీజేపీల మధ్య అగ్గి రాజేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో జగన్ సత్సంబంధాల కోసం తపిస్తున్న నేపథ్యంలో ఈ తరహా ఘటన… అది కూడా తన సొంత జిల్లాలో రేకెత్తడంతో జగన్ కు ఇబ్బందుల్లో పడిపోతారా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయినా ఈ వివాదం ఏమిటి? ఈ వివాదం కారణంగా వైసీపీ, బీజేపీల మధ్య అగ్గి ఏ స్థాయిలో రాజుకోనుంది? అన్న వివరాల్లోకి వెళ్లిపోదాం పదండి.
జిన్నా రోడ్డులో టిప్పు సుల్తాన్ విగ్రహం?
కడప జిల్లా ప్రొద్దటూరులోని జిన్నా రోడ్డులో అక్కడి ముస్లిం సోదరులు టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి కాగా… విగ్రహ ప్రతిష్టాపనకు కూడా రంగం సిద్ధమైపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే మత సామరస్యానికి తూట్లు పొడిచేలా టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఎలా ఏర్పాటు చేస్తారంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆరోపణలతోనే సరిపెట్టని బీజేపీ… విగ్రహ ప్రతిష్టాపనను అడ్డుకుంటామని ప్రకటించింది. అంతేకాకుండా ప్రొద్దటూరులో పర్యటించేందుకు బీజేపీ కీలక నేత విష్ణువర్ధన్ రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ వైసీపీ, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఎంట్రీ ఇచ్చిన పోలీసులు విష్ణువర్దన్ రెడ్డిని అదుపులోకి తీసుకుని అప్పటికప్పుడు పరిస్థితిని శాంతింపజేశారు.
వైసీపీపై బీజేపీ ఫైర్
అయితే టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన ముస్లిం సోదరులకు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి దన్నుగా నిలిచినట్లు బీజేపీ నేతలు గ్రహించారు. రాష్ట్రంలో ఇప్పటికే రేకెత్తిన మత సంబంధ వివాదాలు చాలవన్న రీతిలో తాజాగా టిప్పు సుల్తాన్ విగ్రహ ప్రతిష్టాపనకు ఎలా అనుమతిస్తారని, ఈ విషయంలో ముస్లింకు ఎలా మద్దతు పలుకుతారంటూ బీజేపీ నేతలు వైసీపీ ఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో రాచమల్లు కూడా ఎంట్రీ ఇచ్చేస్తూ… టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ప్రతిష్టించి తీరతామన్న రీతిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు విన్నంతనే… బీజేపీ ఏపీ ఇంచార్జీ సునీల్ థియోధర్ వైసీపీ సర్కారు తీరుపై తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మత ఘర్షణలకు చెలరేగేలా వైసీపీ సర్కారు యత్నిస్తోందని, ఇలాంటి చర్యలను చూస్తూ ఊరుకునేది లేదని సునీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కసబ్ విగ్రహాన్నీ నిలబెడతారా?
ఈ నేపథ్యంలో వైసీపీ, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ నేతలు కావాలనే కడప జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు విన్నంతనే బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి ఓ రేంజిలో ఫైరయ్యారు. చరిత్ర తెలుసుకోకుండా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని ఆయన కౌంటర్ ఇచ్చారు. ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేస్తే తాము ఊరుకోమని విష్ణువర్ధన్‌రెడ్డి మరోసారి హెచ్చరించారు. టిప్పుసుల్తాన్ విగ్రహంతోనే వైసీపీ పతనం మొదలవుతుందంటూ నిప్పులు చెరిగారు. మొదట టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టి తరువాత అఫ్జల్ గురు విగ్రహం పెట్టేందుకు కూడా సిద్దమవుతారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ సర్కార్‌కు టిప్పుసుల్తాన్, కసబ్, అప్ఘల్ గురు వంటి వారు దేశభక్తుల్లా కనిపిస్తున్నారని ఆయన మండిపడ్డారు. వీరి చరిత్ర పాఠ్యాంశాలలో చేర్చాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Must Read ;- ఔను వాళ్లిద్దరూ ఇష్టపడుతున్నారు.. బలపడుతున్న బీజేపీ, వైసీపీ బంధం











