పూరి జగన్నాథ్ ఎంతోమంది హీరోలకు లైఫ్ ఇచ్చాడు. కొంతమంది హీరోలకు మాస్ ఇమేజ్ తీసుకొచ్చాడు .. మరికొంతమంది హీరోలకు రొమాంటిక్ హీరోగా ఎక్కువ మార్కులు తెచ్చిపెట్టాడు. అలాంటి పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా ఒక సినిమా వస్తుందంటే అందరిలో ఆసక్తి పెరగడం సహజం. అలాంటి ఆకాశ్ పూరి .. ఇప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘రొమాంటిక్‘ ముస్తాబవుతోంది. యూత్ అంతా కూడా ఇప్పుడు ఈ సినిమాను గురించే ఎదురుచూస్తోంది.
ఒక వైపున ఈ సినిమా విడుదలకి రెడీ అవుతుండగానే, మరో వైపున మరో ప్రాజెక్టుకు ఆకాశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. నిన్ననే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. వీఎస్ రాజు – సురేశ్ వర్మ నిర్మిస్తున్న ఈ సినిమాకి, ‘జార్జిరెడ్డి‘ దర్శకుడు జీవన్ రెడ్డి దర్శకత్వం వహించనున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీ నేపథ్యంలో రూపొందిన ‘జార్జి రెడ్డి’ బయోపిక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కాలేజ్ క్యాంపస్ వాతావరణాన్ని ఆవిష్కరించిన తీరుకు .. సహజత్వానికి దగ్గరగా పాత్రలను నడిపించిన విధానానికిగాను జీవన్ రెడ్డికి ప్రశంసలు దక్కాయి.
అలాంటి జీవన్ రెడ్డి .. ఇప్పుడు ఆకాశ్ తో ఒక సినిమా రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా నిర్మితం కానుంది. ఈ సినిమాకి ‘చోర్ బజార్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. టైటిల్ ను బట్టే ఇది స్టూడెంట్స్ ను .. మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన కథ అనే విషయం అర్థమవుతోంది. ఈ నెల 26వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ‘నిరీక్షణ’ హీరోయిన్ ‘అర్చన‘ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషించనుండటం విశేషం.
Must Read ;- పవర్ స్టార్ తో మరోసారి పూరి జగన్నాథ్











