కొన్ని సంవత్సరాల నుండి సరైన హిట్ లేక సతమతమవుతున్న హీరో అల్లరి నరేష్. ఆమధ్య మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ సినిమాలో ఓ ప్రధానమైన పాత్రలో నటించి మంచి విజయం అందుకున్నాడు. ప్రస్తుతం అల్లరోడు ‘నాంది’ అనే వైవిధ్యమైన సినిమాలో నటిస్తున్నాడు. ఎస్‌వీ2 ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సతీశ్ వేగేశ్న నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ అవ్వాలి. కానీ లాక్ డౌన్ కారణంగా షూటింగ్ దాదాపు ఏడు నెలలు నిలిచిపోయింది.
ఈమధ్యనే తిరిగి ప్రారంభించిన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకొని ఇటీవలే షూటింగ్ పూర్తి అయినట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి న్యూ పోస్టర్ ఒకటి విడుదల చేశారు. అల్లరి నరేష్ కామెడీ శైలికి పూర్తి భిన్నంగా వినూత్నమైన కథ, కథనాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమా అల్లరి నరేష్ కు 57వ చిత్రం కావడం విశేషం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ ఒక్క టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచాడు దర్శకుడు విజయ్. ఈ సినిమాలో ఒక సన్నివేశం కోసం అల్లరి నరేష్ ఏకంగా నగ్నంగా కూడా నటించాడు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, నవమి, ప్రియదర్శి, ప్రవీణ్, దేవి ప్రసాద్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా త్వరలోనే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్ లోకి రావాలని నరేష్ చూస్తున్నాడు. మరి ‘నాంది’ సినిమా నరేశ్ సరికొత్త కెరీర్ కు నాంది పలుకుతుందేమో చూడాలి.











