పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాల్లో నటిస్తున్నారు.. మరో వైపు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఆయన సినిమాల కన్నా రాజకీయాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి అనుకుంటున్నారట. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీని బలోపేతం చేయాలనేది పవర్ స్టార్ ప్లాన్. అయితే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా పవన్ కళ్యాణ్ 2022లో సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా చేస్తున్నారు.
ఈ చిత్రానికి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు, స్క్రీన్ ప్లే అందిస్తుండడం విశేషం. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ రావడం వలన సంక్రాంతికి భీమ్లా నాయక్ రిలీజ్ కావడం కుదరకపోతే మార్చి నెలలో భీమ్లా నాయక్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత పవన్ చేయనున్న మూవీ హరి హర వీరమల్లు. క్రిష్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ భారీ పీరియాడిక్ మూవీ 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఈ చిత్రాన్ని 2022 సమ్మర్ లో రిలీజ్ చేయాలనేది ప్లాన్. పవన్ చేతిలో ఉన్న మరో సినిమా ‘భవదీయుడు భగత్ సింగ్’. ఈ చిత్రానికి గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకుడు. ఇటీవల ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. 2022 ఎండింగ్ కి ఈ చిత్రాన్ని కంప్లీట్ చేయాలనేది ప్లాన్. ఈ మూడు సినిమాలు కంప్లీట్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకుంటున్నారని సమాచారం. అయితే.. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో సినిమా చేయడానికి పవన్ ఓకే చెప్పారు కానీ.. ఈ సినిమా ఉంటుందా..? ఉండదా..? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది అంటున్నారు. త్వరలో క్లారిటీ వస్తుందేమో చూడాలి.











