ఏపీ సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలోని బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేదాకా ఆ ఎన్నికపై ఎవరూ అంతగా దృష్టి సారించలేదు. అయితే ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కాగానే.. ఒక్కసారిగా బద్వేల్‌లో రాజకీయ వేడి రాజుకుంది. ప్రత్యేకించి అధికార వైసీపీ ఈ ఎన్నిక పట్ల కలవరానికి గురవుతున్నట్లుగా స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో కడప జిల్లాను వైసీపీ క్లీన్ స్వీప్ చేయగా.. బద్వేల్ నుంచి డాక్టర్ వెంకటసుబ్బయ్య విజయం సాధించారు. అయితే ఇటీవలి కాలంలో అనారోగ్యంతో ఆయన మృతి చెందడంతో బద్వేల్ అసెంబ్లీకి ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం ఏపీలో రాజకీయ పరిస్థితులను తరచి చూస్తే.. వైసీపీ ఈజీగానే ఈ స్థానాన్ని దక్కించుకుంటుందని అంతా భావించారు. అయితే ఎందుకనో గానీ.. బద్వేల్ బైపోల్‌లో విజయం తమకు అంత ఈజీ కాదన్న భావన వైసీపీలోనే వ్యక్తమవుతోంది. అందుకు నిదర్శనంగానే వైసీపీ కీలక నేత, సీఎం జగన్‌కు రాజకీయ సలహాదారుగా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ పాలనకు రెఫరెండం కాదట
బద్వేల్ బైపోల్ కు షెడ్యూల్ ఖరారు కాగానే.. మంగళవారం నాడు మీడియా ముందుకు వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బద్వేల్ ఉప ఎన్నిక సీఎం జగన్ పాలనకు రెఫరెండం కాదని సజ్జల ఆసక్తికర కామెంట్ చేశారు. బద్వేల్ సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మృతి నేపథ్యంలో జరుగుతున్న ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిగా వెంకటసుబ్బయ్య సతీమణి సుధా బరిలోకి దిగుతున్నాకరని ఆయన చెప్పారు. బద్వేల్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే తమ పార్టీ యాక్షన్ ప్లాన్ రూపొందించిందని కూడా సజ్జల చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికలో టీడీపీ పోటీ చేస్తున్నదీ, లేనిదీ తమకు తెలియదని చెప్పిన సజ్జల.. తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ అనుసరించిన వ్యూహాన్ని కూడా చూశామని చెప్పుకొచ్చారు. మా మేనిఫెస్టోలో ప్రస్తావించిన హామీలన్నింటినీ తాము ఇప్పటికే నెరవేర్చామని తెలిపారు. అయినా కూడా ఈ ఉప ఎన్నిక ఫలితం జగన్ పాలనకు మాత్రం రెఫరెండం కాదని సజ్జల ఆసక్తికర కామెంట్ చేశారు. ఒక్క స్థానానికి జరిగే ఎన్నికతో ప్రజల మనసును తెలుసుకోలేమని ఆయన తనదైన లాజిక్ ను లాగారు. ఇలా ఎవరూ అడక్కుండానే.. ఈ ఎన్నిక జగన్ పాలనకు రెఫరెండం కాదని స్వయంగా సజ్జల చెప్పడంతో ఇప్పుడు బద్వేల్ లో వైసీపీ విజయంపై ఆ పార్టీకే నమ్మకం లేదా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి
సజ్జల భయానికి రీజనేంటంటే..?
బద్వేల్ ఉప ఎన్నికను వైసీపీ ఆదిలో చాలా ఈజీగానే తీసుకుంది. అయితే ఈ ఎన్నికపై ఆదిలోనే దృష్టి సారించిన విపక్ష టీడీపీ.. ఇప్పటికే తన అభ్యర్థిని ప్రకటించేసింది. వెంకటసుబ్బయ్య చేతిలో పరాజయం పాలైన ఓబుళాపురం రాజశేఖరే ఈ ఎన్నికలోనూ తన అభ్యర్థిగా టీడీపీ ప్రకటించింది. ఈ ప్రకటనతోనే సరిపెట్టక.. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పాగా వేసే దిశగా చర్యలు చేపట్టింది. రాజశేఖర్‌ను నిత్యం బద్వేల్‌లోనూ ఉండేలా ప్లాన్ చేసిన టీడీపీ.. పార్టీకి చెందిన కొందరు కీలక నేతలను బరిలోకి దించింది. ప్రజల మూడ్‌ను బట్టి వ్యూహాలు మార్చుకుంటూ సాగిన టీడీపీ.. బద్వేల్ నియోజకవర్గంపై పూర్తి స్థాయిలోనే పట్టు సాధించినట్లుగా తెలుస్తోంది. చాప కింద నీరులా దూసుకుపోతున్న టీడీపీని చూసిన జగన్ వెనువెంటనే బద్వేల్ ను రెవెన్యూ డివిజన్ గా ప్రకటిస్తామని హామీ ఇవ్వడంతో పాటుగా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు నిధులను కూడా విడుదల చేశారు. ఇందుకోసం జగన్ ఏకంగా బద్వేల్‌లో భారీ బహిరంగ సభనే నిర్వహించిన సంగతి తెలిసిందే. టీడీపీ దూకుడును కనిపెట్టినా.. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక చూద్దాంలే అన్న రీతిలో వైసీపీ సాగగా.. అప్పటికే టీడీపీ శ్రేణులు బద్వేల్ ను చుట్టేశారట. ఇదే విషయాన్ని తెలుసుకున్న వైసీపీ అధిష్ఠానం బద్వేల్ లో గెలుపు అంత ఈజీ కాదని ఓ అంచనాకు వచ్చిందట. అదే విషయం ఇప్పుడు సజ్జల నోట నుంచి పరోక్షంగా వచ్చిందన్న మాట. మొత్తంగా బద్వేల్ ఉప ఎన్నికలో విజయం దిశగా టీడీపీ దూసుకుపోతున్న వైనంతో వైసీపీలో అప్పుడే ఆందోళన మొదలైపోయిందన్న విశ్లేషణలు సాగుతున్నాయి.