సంక్రాంతి సినిమాలకూ సెంటిమెంట్ పండుగే. సంక్రాంతి వచ్చిందంటే పెద్ద సినిమాల హడావుడి ఎక్కువగా ఉంటుంది.ఈ టైమ్ లో రిలీజ్ చేస్తే మూవీ కాసుల వర్షం కురిపిస్తుందని నమ్మకం.ఇక సంక్రాంతి హీరో అనగానే గుర్తొచ్చేది నటసింహ బాలకృష్ణ. ఈ పండుగకి రిలీజ్ అయిన ఆయన సినిమాలు ఎన్నో బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ టాక్ ని అందుకుని, 100, 175, 200 డేస్ ఆడాయి. ఇక బాలయ్యకు సంక్రాంతి సెంటిమెంట్ ఎక్కువేనట.. అందుకే ప్రతీ సంక్రాంతికి ఒక సినిమా ఉండేలా ఆయన ప్లాన్ చేసుకుంటారని టాక్. ఈ క్రమంలోనే రానున్న సంక్రాంతి బరిలో దిగేందుకు బాలయ్య సిద్ధం అవుతున్నారనే వార్తలు ప్రస్తుతం ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో చెక్కర్లు కొడుతున్నాయి.
ప్రస్తుతం బాలకృష్ణ, మలినేని గోపీచంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK 107వ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాని ఆగస్టులో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కాగా, బాలయ్య తన నెక్స్ట్ మూవీని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న అనిల్ రావిపూడి డైరక్షన్ లో చేయబోతున్న సంగతి తెలిసిందే.ఇటీవలే అనిల్ ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా చేశారు.
ప్రస్తుతం అనిల్ రావిపూడి, బాలయ్య కాంబోలో రూపొందనున్న చిత్రానికి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో సాగానున్న ఈ మూవీలో బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల నటిస్తున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించారు.ఈ చిత్రంలో కథానాయికలుగా ప్రియమణి, మెహ్రీన్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగును జులైలో మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది.ఇక డిసెంబర్ నాటికి అన్ని పనులను పూర్తిచేసి సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.
దీంతో మొత్తం మీద బాలయ్య 108వ సినిమా కూడా సంక్రాంతి బరిలోకి దిగడం దాదాపు ఖరారైందని ఆయన అభిమానులు చర్చించుకుంటున్నారు.