ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి పాల వ్యాపారం పెట్టుకుని వార్తల్లోకి ఎక్కాడు ఓ వ్యక్తి.తన వ్యాపారంతో ఇతర ఔత్సాహిక పెట్టుబడిదారులకు స్పూర్తిగా నిలుస్తున్నాడు అతను. పాల వ్యాపారం పెడితే అందులో ఏం విశేషం అనుకుంటే అక్కడే పప్పులో కాలేసినట్లే. ఆ వ్యక్తి పెట్టిన వ్యాపారం ఏ ఆవు పాలో, గేదె పాలతోనో కాదు గాడిద పాలతో. అవును నిజమే.. గాడిద పాల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేసి తన వ్యాపారాన్ని సాగిస్తున్న ఆ వ్యక్తి సక్సెస్ స్టోరీ తాజాగా వెలుగులోకి వచ్చింది.
కర్ణాటకలోని మంగళూరుకు చెందిన శ్రీనివాస గౌడ అనే వ్యక్తి ఓ ప్రముఖ ఐటీ సంస్థలో ఉద్యోగం చేసేవాడు.2020లో కరోనా కారణంగా అమలులోకి వచ్చిన లాక్ డౌన్ కారణంగా అతను తన ఉద్యోగానికి స్వస్తి పలికేశాడు. కొంత కాలం ఖాళీగా ఉన్న శ్రీనివాస గౌడ భవిష్యత్తు గురించి ఆలోచన చేసి ఇకపై ఉద్యోగం కాకుండా ఏదైనా సొంతంగా చేయాలనే నిర్ణయానికి వచ్చాడు. ఈ క్రమంలోనే ఏదైనా ప్రత్యేకంగా చేయాలని ఆలోచించిన ఆయన గాడిద పాల వ్యాపారం అయితే బాగుంటుందని భావించి దానికి శ్రీకారం చుట్టాడు.
దేశంలో గాడిదల సంతతి తగ్గిపోతుండడంతో వాటి సంరక్షణతో పాటు ఔషద గుణాలు కలిగిన గాడిద పాలను ప్రతీ ఒక్కరికీ అందుబాటులో ఉంచాలనే ఆలోచనతో ఈ నిర్ణయానికి వచ్చారట. గాడిద పాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని.. అందరికీ అందుబాటులో ఉండేలా విక్రయానికి ఓ ప్రణాళికా సిద్ధం చేసుకుని వ్యాపారం మొదలు పెట్టారు.
ఈ వ్యాపారం కోసం శ్రీనివాస గౌడ 42 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి 20 గాడిదలను సమకూర్చుకున్నాడు.మాల్స్, షాపులు, సూపర్ మార్కెట్లలో ఆవు, గేదె పాల మాదిరే గాడిద పాలను విక్రయానికి ఉంచేలా సన్నాహాలు చేస్తున్నాడు గౌడ.ఇక ఖరీదులో గాడిద పాలు.. ఆవు, గేదె పాలకంటే ఎక్కువనే చెప్పుకోవాలి. కేవలం 30 ఎమ్.ఎల్. పాల ధర సుమారు 150 రూపాయల వరకు పలుకుతుంది.ఇక ఇప్పటికే 17 లక్షల విలువ ఆర్డర్లు కూడా వచ్చాయట. కాగా ప్రస్తుతం శ్రీనివాస గౌడ నిర్వహిస్తున్న ఈ వ్యాపారం దేశంలోనే ప్రత్యేకమైనదిగా నిలుస్తోంది.కర్ణాటకలోనూ ఇదే మొదటి గాడిదల పెంపకం, పాల ఉత్పత్తి కేంద్రంగా మారింది.