సినిమా టిక్కెట్ రేటు ఇంత తక్కువ ఉన్నా బాలయ్య సినిమా అంత కలెక్షన్ వసూలు చేయడమా? ఎవరి నోట విన్నా ఇప్పుడు ఇదే మాట. ‘అఖండ’ సినిమా సాధించిన వసూళ్లు చూసి అంతా విస్తుబోతున్నారు. ఈ సినిమా విడుదలైంది కార్తీక మాసంలో. అంటే డిసెంబరు 2న సినిమా విడుదలైంది. ఒక విధంగా ఇది సినిమాలకు అన్ సీజన్. ముఖ్యంగా బీ, సీ సెంటర్లలో థియేటర్లకు జనం రారు అనే సంగతి అందరికీ తెలిసిందే. ఇది వ్యవసాయ సీజన్ కావడమే అందుకు కారణం. వ్యవసాయ కూలీలు వరికోతల్లో నిమగ్నమై ఉంటారు. రైతులంతా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటారు. ఇక సినిమాల గురించి ఆలోచించే సమయమే ఉండదు.
దానికి తోడు కరోనా భయం, ఒమెక్రాన్ అనే మరో వైరస్ భయం.. అయినా అఖండ భారీ వసూళ్ల దిశగా దూసుకుపోయింది. విడుదల కోసం క్యూలో ఉన్న సినిమాలకు ఇది కొండంత బలాన్ని ఇచ్చింది. ఈ నెల 17న పుష్ప విడుదలవుతోంది. ఆ తర్వాత నాని ‘శ్యామసింగరాయ్’ ఉంది. మధ్యలో గని విడుదల కావలసి ఉన్నా పుష్ప కు అవకాశం ఇచ్చేందుకు బరి నుంచి వైదొలగింది. రాజమౌళి ట్రిపుల్ ఆర్ దూకుడు మీద ఉంది. ఆ తర్వాత భీమ్లా నాయక్, రాధేశ్యామ్ చిత్రాలు విడుదలవుతున్నాయి. వచ్చేది సంక్రాంతి సీజనే కాబట్టి వసూళ్ల విషయంలో ఎలాంటి ఢోకా లేదు. కాకపోతే ఒమెక్రాన్ కేసులు మరో పక్క అందరినీ వణికిస్తున్నాయి.
అఖండ ఎంత వసూలు చేసింది?
అఖండ సినిమా ఇప్పటిదాకా ఎంత వసూలు చేసిందన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. 10 రోజుల వ్యవధిలోనే రూ. 100 కోట్ల మార్కును బాలకృష్ణ అందుకున్నారు. ఇప్పటిదాకా బాలయ్య ఇందులో సగం కలెక్షన్లు కూడా సాధించలేదు. ఇంతకుముందు భారీ హిట్ అయిన సింహా లెజండ్ చిత్రాల వసూళ్లు రూ. 40 కోట్ల వరకే ఉన్నాయి. మొట్టమొదటిసారిగా రూ. 100 కోట్ల క్లబ్ ను బాలయ్య చేరుకున్నారు. ఈ వసూళ్లు ఇంకా ఎక్కడి వరకు వెళతాయన్నది అంచనా వేయడం కష్టం.
ఈ డిసెంబరు 17న పుష్ప విడుదలవుతుంది కాబట్టి అప్పటిదాకా అఖండ అప్రతిహతంగా ముందుకు సాగిపోతాడు. దాదాపు రూ. 130 కోట్ల వసూళ్లు సాధించవచ్చని అంచనా వేస్తున్నారు. పాన్ ఇండియా సినిమా అయిన పుష్ప ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 150 కోట్ల వరకూ సాగింది. అంటే దాదాపు పుష్ప దగ్గరి వరకూ అఖండ వసూళ్లు ఉన్నాయనుకోవచ్చు. 100 కోట్ల గ్రాస్ ను షేర్ పరంగా లెక్కిస్తే 58.74 కోట్లు వసూలైంది. టిక్కెట్ రేట్లు ఇంకా ఎక్కువగా ఉన్నట్లయితే కచ్చితంగా రూ. 200 కోట్ల మార్క్ ను అఖండ దాటేసేది అనడంలో అతిశయోక్తి లేదు. అఖండ విజయం తెలుగు చిత్ర పరిశ్రమకు ఊపరిపోసింది. హీరోగా బాలయ్య మార్కెట్ ను విస్తరించింది.
Must Read ;- అఖండకు సీక్వెల్ వస్తుందా?











