ఈరోజు టాక్ ఆఫ్ ది సినిమా ఇండస్ట్రీ ఏదన్నా ఉందంటే అది ‘అఖండ’ సినిమానే. సినిమా విజయం మీద ఓ క్లారిటీ వచ్చేసింది. ఇది అఖండమైన విజయమని అందరూ ముక్తకంఠంతో అంటున్నారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో అందరూ ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ‘అఖండ’ తర్వాత వరుసగా పెద్ద సినిమాలు విడుదల కానున్నాయి. ఈ సినిమా ఇచ్చే ఫలితం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఆ ఫలితం వచ్చేసింది.. భారీ వసూళ్ల దిశగా అఖండ పయనిస్తోంది. దాంతో అందరూ ఊపిరితీసుకున్నారు.
భారీ వసూళ్లకు అవకాశాలు ఏమీ తగ్గిపోలేదన్న నమ్మకం ఏర్పడింది. హీరోలు సైతం ఈ సినిమాల గురించి కామెంట్లు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘ఇప్పుడే అఖండ చూశా. బాలా బాబాయ్ కి, సినిమా టీమ్ కి అభినందనలు’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ కామెంట్ చేశారు.దర్శకుడు బోయపాటి శ్రీనును కూడా అభినందించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా స్పందించారు.
అఖండ శుభారంభాన్ని పలికిందని వ్యాఖ్యానించారు. భారీ వసూళ్లతో ప్రారంభం కావడం పట్ల సంతోషం ప్రకటించారు. బాలకృష్ణ, బోయపాటిలను అభినందించారు. బాలకృష్ణ గేట్లు ఓపెన్ చేశారని నాచురల్ స్టార్ నాని కూడా కామెంట్ చేశారు. అఖండ టీమ్ కు అభినందనలు తెలిపారు. యువ హీరోలు రామ్ పోతినేని, నిఖిల్ సిద్దార్థ, సందీప్ కిషన్, బండ్ల గణేష్, దర్శకులు గోపీచంద్ మలినేని, నందిని రెడ్డి, మంచు విష్ణు, మంచు లక్ష్మి లాంటి వారంతా స్పందించి అఖండ టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు.
బాలకృష్ణ నటవిశ్వరూపం చూపెట్టారు: నందమూరి రామకృష్ణ
నట సింహం బాలకృష్ణ నట విశ్వరూపాన్ని చూపారంటూ ఆయన సోదరుడు, నిర్మాత నందమూరి రామకృష్ణ వ్యాఖ్యానించారు. ‘సినిమా రంగానికి మళ్లీ నాటి వైభవం వచ్చింది. కరోనా మహమ్మారి తీవ్రతవల్ల సినీ పరిశ్రమ చాలా నష్టపోయింది. ముఖ్యంగా సినీ కార్మికులు, సాంకేతిక నిపుణులు, ఎక్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, వీటిమీద ఆదారబడ్డ చిన్న వ్యాపారులు బాగా దెబ్బ తిన్నారు.
వీరందరికీ ఈ అఖండ ఒక అఖండ జ్యోతి. బాలకృష్ణ గారు తన రికార్డు తనే బద్దలు కొడతారు.‘రౌడీ ఇన్స్పెక్టర్’ మించి ‘బొబ్బిలి సింహం’ దాన్ని మించి ‘నిప్పురవ్వ’, ‘పెద్దన్నయ్య’ ఆడాయి. ఆ తర్వాత “సమరసింహా రెడ్డి” , “నర్సింహనాయుడు”, “లెజెండ్” , “సింహ” తర్వాత నేడు ఈ అఖండ చిత్రం. చరిత్ర సృష్టించాలన్నా, దాన్ని తిరగరాయాలన్న తనేనని నందమూరి నటసింహం నిరూపించాడు’ అని వివరించారు.
Must Read ;- అఖండ ఫస్డ్ డే కలెక్షన్స్ వివరాలు











