దేశంలో కరోనా వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. సోమవారం కన్నా మంగళవారం కేసులు కొద్దిగా పెరిగినప్పటికీ.. మరణాల సంఖ్య మాత్రం వంద లోపే కొనసాగుతున్నాయి. కరోనా కట్టడిలో భారత్ మెరుగుపడుతోందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. అంతేకాదు.. వ్యాక్సినేషన్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పినట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ అధికారక లెక్కలు విడుదల చేసింది. కేంద్రం లెక్కల ప్రకారం కరోనా కట్టడిగానే కొనసాగుతూ.. మరణాల శాతం కూడా చాలా వరకు తగ్గిపోవడంతోపాటు.. రికవరీ శాతం కూడా 97 శాతం ఉండడం ఆనందిచాల్సిన విషయం.
కరోనా లెక్కలివే..
మంగళవారం 11,067 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మరో 94 మంది మృత్యువాత పడ్డారు. దీంతో.. మొత్తం కేసుల సంఖ్య 1.08 కోట్లకు చేరుకోగా.. మరణాల సంఖ్య 1,55,252కి పెరిగింది. అలాగే, రోజువారీ రికవరీలు మాత్రం కొత్త కేసుల కన్నా అధికంగానే నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో మొత్తం 13,087 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో.. మొత్తం రికవరీల సంఖ్య 1,05,61,608కి చేరుకుంది. రికవరీ రేటు 97.27 శాతానికి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 1,41,511 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇది మొత్తం కేసుల్లో 1.30 శాతం మాత్రమే కావడం గమనార్హం.
జోరుగా వ్యాక్సినేషన్..
మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ఫిబ్రవరి 9 నాటికి రికార్డు స్థాయిలో 66,11,561 మందికి టీకాలు అందించారు. ఈ క్రమంలో.. తక్కువ సమయంలో ఎక్కువ మందికి టీకాలు అందించిన దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. మంగళవారం ఒక్కరోజే 3,52,553 మందికి టీకాలు అందించారు. ప్రపంచంలో ఎక్కువ మందికి టీకాలు అందించిన దేశాల జాబితాలో భారత్.. మూడో స్థానంలో కొనసాగుతోంది. అమెరికా, బ్రిటన్ లు ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో ఉండడం గమనార్హం. తొందరలోనే వారిని అధిగమిస్తామనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఆరోగ్య శాఖ సిబ్బంది.