కరోనా మహమ్మారి.. సామాన్యులు, సెలబ్రిటీలపైనే కాదు.. అడవిలో ఉన్న మావోయిస్టులపై ప్రభావం చూపుతోంది. ఇప్పటికే ఎంతోమంది మావోయిస్టులు కరోనా బారిన పడ్డారు. గుట్టుచప్పుడు కాకుండా వైద్యం చేయించుకుంటున్నారు. తీవ్ర లక్షణాలు ఉండటంతో రహస్య స్థావరాలను విడిచి వస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది మావోయిస్టులు సైతం పోలీసులకు చిక్కిన సందర్భాలు సైతం ఉన్నాయి.
తాజాగా ఇద్దరు మావోయిస్టులు కరోనాతో చనిపోయినట్లు తెలుస్తోంది. జూన్ 20న మావోయిస్టు తెలంగాణ కార్యదర్శి హరిభూషణ్, మరో మావోయిస్టు భారతక్క చనిపోయారు. అయితే వీళ్ల మరణంపై ఎన్నో సందేహాలు వ్యక్తమయ్యాయి. ఎలా చనిపోయారు.. ఎప్పుడు చనిపోయారు? అనే విషయాలు పోలీసులు, కొంతమంది మావోయిస్టులకు సైతం తెలియదు. వీటి అన్నింటికి బదులిస్తూ మావోయిస్టు శాఖ లేఖలను విడుదల చేసింది. కరోనా కారణంగానే హరిభూషణ్, భారతక్కలు చనిపోయినట్లు, ప్రజల మధ్యే అంత్యక్రియలు జరిపినట్లు లేఖలో తెలిపింది. గతంలో వీరిద్దరు చనిపోయినట్లు పోలీసులు భావించారు. అయితే మావోయిస్టులు లేఖ విడుదల చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. హరిభూషణ్, భారతక్కలు గెరిల్లా టీంలో చురుగ్గా వ్యవహరించారు. తెలంగాణ కమిటీలో కీలకం వ్యవహరించారు. వీళ్లద్దరి మరణంతో తెలంగాణ మావోయిస్టు పార్టీ ఎదురు దెబ్బ పడినట్లయింది.
Must Read ;- మావోయిస్టులకు కరోనా.. వైద్య సేవలు అందిస్తామంటున్న పోలీసులు













