(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం మంప పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగలమెట్ట వద్ద గ్రేహౌండ్స్ దళాలు, మావోయిస్టులకు మధ్య బుధవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. మావోయిస్టులు ఉన్నారన్న సమచారంతో మంప పీఎస్ పరిధిలో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో తెల్లవారుజామున ఇరు వర్గాల మధ్య కాల్పులకు దారితీసింది. ఎవరు చనిపోయారు? ఎంత మంది గాయపడ్డారో తెలియాల్సి ఉందని కొయ్యూరు సీఐ వెంకటరమణ తెలిపారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో వివరాలు తెలియడానికి సమయం పడుతుందని వివరించారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోందని చెప్పారు. ఘటనాస్థలికి అదనపు బలగాలను తరలిస్తున్నామన్నారు. ఘటనాస్థలిలో ఏకే- 47 తుపాకులు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. మావోయిస్టు అగ్ర నేతలు తప్పించుకున్నారన్న సమాచారంతో హెలికాప్టర్ సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.
Must Read ;- మావోయిస్టులకు కరోనా.. వైద్య సేవలు అందిస్తామంటున్న పోలీసులు











