(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
మావోయిస్టులు కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది.కరోనాతో మావోలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు పోలీస్ వర్గాలకు సమాచారం అందుతోంది. నగర పరిధిలో ఉంటూ కరోనా బారిన పడిన రోగులు సకాలంలో వైద్యం పొందలేక ప్రాణాలు కోల్పోతున్నారు. అంబులెన్సులు మొదలు ఆక్సిజన్ వరకు.. ప్రతిదీ సమస్యగానే మారుతోంది. అటువంటిది.. ఎటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థకు చిక్కకుండా, కారు చీకట్లో, చిట్టడవుల్లో తలదాచుకున్న మావోలకు వైరస్ సోకితే వాళ్ళు ప్రాణాలతో బయటపడటం అంత సులభమా?
మానవతా దృక్పథంతో..
ఇటువంటి ఆలోచనతోనే మావోయిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలు అందించేందుకు విశాఖ పోలీసులు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చారు.ఈ మేరకు బహిరంగ ప్రకటన విడుదల చేశారు.ఇప్పటికీ వారి వద్ద సమాచారం ఉందని.. అనేకమంది కరోనా వైరస్‌తో బాధపడుతున్నారని, అయితే ఒక్కసారి పోలీసుల వద్దకు వెళితే దళంలో ఒక సభ్యుడిని కోల్పోవాల్సి వస్తుందని, నాయకులు అడ్డుకుంటున్నారని పోలీసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గాలికొండ, కోరుకొండ, పెదబయలు,కటాఫ్ ఏరియాకు చెందిన సభ్యులు కోవిడ్ వైరస్ బారిన పడినట్లుగా పోలీసులకు పక్కా సమాచారం ఉంది. అంతేకాకుండా వారి వల్ల కుటుంబ సభ్యులు కొందరు వైరస్‌తో బాధపడుతున్నట్టు తెలుసుకున్నారు. ప్రాణం కన్నా ఏది ఎక్కువ కాదని, వైరస్ లక్షణాలు ఉన్న వాళ్ళు సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి సంప్రదిస్తే, కావలసిన చికిత్స అందిస్తామని, అనంతరం డిశ్చార్జ్ చేసి ఇళ్లకు పంపుతామని పేర్కొన్నారు.మావోయిస్టుల రాక కొసం పోలీసులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. పార్టీని వీడి వస్తే వైద్య సదుపాయం అందించడంతో పాటు ఆర్ధికంగా కూడా అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మావోలకు కరోనా ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తోంది.
ఛత్తీస్‌గఢ్ పరిధిలోనూ..
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ రీజన్ పరిధిలో దంతేవాడ,బీజాపూర్,సుక్మా జిల్లాలో సుమారు 70 నుంచి100 మంది వరకు మావోయిస్టులకు కరోనా సోకినట్లు సమాచారం. ఈ విషయాన్ని పోలీస్ వర్గాలు కూడా దృవీకరిస్తున్నాయి. కరోనాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో కొందరు బాధపడుతున్నట్లు తెలుస్తుంది. వారిలో మోస్ట్ వాంటెడ్ మహిళా మావోయిస్టు సుజాత(25లక్షల రూపాయల రివార్డ్),తో పాటు 10 లక్షల రూపాయల రివార్డులు కలిగిన మావోయిస్టులు జయలాల్, దినేష్‌లు ఉన్నట్లు సమాచారం.కోవిడ్‌తో బాధపడుతున్న మావోలు జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లయితే వారందరికీ ప్రభుత్వం తరపున మంచి వైద్యం అందిస్తామని దంతేవాడ ఏస్పీ అభిషేక్ పల్లవ్ హామీ ఇచ్చారు.












