ఓ వైపు కరోనా సెకండ్ వేవ్‌తో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే మంత్రి ఆదిమూలపు సురేష్ మాత్రం పది, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించటంపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి. ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని ప్రతి పక్షాలు కోరుతున్నాయి. పిల్లల ఫ్రాణాలకంటే పరీక్షలు ముఖ్యం కాదని అంటున్నాయి. కేంద్ర ఫ్రభుత్వం, చాలా రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేస్తే ఏపీ ప్రభుత్వానికి దీనిపై ఎందుకు అంత పట్టుదలని ప్రశ్నిస్తున్నాయి.
వందల మంది ఉపాధ్యాయులు..
కరోనా సెకండ్ వేవ్ ఏపీలో వందలాది మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను పొట్టన బెట్టుకుంది.మార్చిలో జరిగిన స్థానిక ఎన్నికల్లో ఉపాధ్యాయులు చురుగ్గా పాల్గొన్నారు.ఆ తరవాత వచ్చిన కరోనా సెకండ్ వేవ్ ఏపీలో 554 మంది ఉపాధ్యాయులను పొట్టనబెట్టుకుంది.ఈ గణాంకాలు కేవలం ప్రాథమిక నుంచి ఉన్నత పాఠశాలల వరకేనని ఆంధప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ప్రతినిధులు ప్రకటించారు. దీనిపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌కు కూడా నివేదిక పంపారు. ఏపీలోని 13 జిల్లాలో 554 మంది ఉపాధ్యాయులు చనిపోయారని, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు కూడా కలుపుకుంటే చనిపోయిన వారి సంఖ్య వేలల్లో ఉంటుందని వారు వెల్లడించారు.
ఏ జిల్లాలో ఎంత మంది..
ఏపీలో ఉపాధ్యాయులను కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ప్రకటించకపోవడంతో వారికి ముందుగా టీకాలు అందలేదు. స్థానిక ఎన్నికల్లో కూడా టీకాలు లేకుండానే పాల్గొన్నారు. దీంతో ఎంతో మంది కరోనా బారిన పడి మరణించారు.జిల్లాల వారీగా గణాంకాలను పరిశీలించినట్లయితే శ్రీకాకుళం-57, విజయనగరం-31, విశాఖపట్టణం-68, తూర్పుగోదావరి-49, పశ్చిమ గోదావరి-48, కృష్ణా-36, గుంటూరు-53, ప్రకాశం-13, నెల్లూరు-30, చిత్తూరు-55, కర్నూలు-44, కడప-42, అనంతపురం జిల్లాలో – 28 మంది మరణించారని ఫ్యాప్టో ప్రతినిధులు ప్రకటించారు. ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా వందలాది మంది కరోనా బారిన పడి మరణించారని, అయితే ఆ గణాంకాలు స్పష్టంగా లేవని ఉపాధ్యాయ సంఘాలు స్పష్టం చేశాయి. వారిని కూడా కలుపుకుంటే 1200 ఉపాధ్యాయులు మరణించి ఉంటారని అంచనా వేశారు.
60 లక్షల మందితో సావాసం
ఏపీలో 3.6 లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఒకటి నుంచి పది తరగతుల వరకు 60 లక్షల మంది విద్యార్ధులకు ప్రభుత్వ పాఠశాలల్లో బోధిస్తున్నారు. గత ఏడాది కరోనా తగ్గిన తరవాత కొన్ని రోజులు పాఠశాలలు నడిపించడంతో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున కరోనా బారిన పడ్డారు. ఈ ఏడాది జనవరిలో కోవిడ్ టీకా అందుబాటులోకి వచ్చినా ఉపాధ్యాయులకు ముందుగా వేయకపోవడంతో వందల సంఖ్యలో కరోనా బారిన పడ్డారని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు ముందే ఉపాధ్యాయులను కరోనా వారియర్స్‌గా గుర్తించి, టీకా ఇచ్చి ఉంటే ఇంత మందిని కోల్పోయే పరిస్థితి వచ్చేది కాదని వారు అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వ వైఖరే కొంప ముంచింది
ఉపాధ్యాయులకు టీకాలు వేయకుండానే స్థానిక ఎన్నికల్లో విధులు నిర్వర్తింపజేయడంతో పాటు, వారికి పాఠశాలల్లో బయోమెట్రిక్ అమలు చేయడంతో కరోనా వేగంగా వ్యాపించింది. డివైస్‌ల ద్వారా కరోనా వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించినా బయోమెట్రిక్ తప్పని సరి చేయడం ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారింది. తెలంగాణలో ముందుగానే పాఠశాలలు మూసి వేయడంతో చాలా తక్కువ మంది ఉపాధ్యాయులు మాత్రమే కరోనా బారిన పడ్డారని ఫ్యాస్టో సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించకపోవడం పెద్ద లోపంగా వారు భావిస్తున్నారు. ఒక ఉపాధ్యాయుడికి కరోనా సోకితే అది నిర్ధరణ అయ్యే లోగా వందలాది విద్యార్థులకు కూడా సోకే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కోవిడ్ బారిన పడి వందలాది మంది ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికైనా ఉపాధ్యాయులను ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించి టీకాలు వేయాలని ఫ్యాప్టో కోరుతోంది. అంతేగాకుండా ఫరీక్షల నిర్వహణపై కూడ పునరాలోచించాలని కోరుతోంది.
Must Read ;- ప్రభుత్వ పట్టింపులు.. కరోనాకు బలవుతున్న ఉపాధ్యాయులు











