భూ ఆక్రమణల ఆరోపణలతో మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి, టీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం రెండు రోజుల క్రితం ధిల్లీలో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఓ లేఖ విడుదలైంది.ఈ లేఖలో ఈటల రాజేందర్ వ్యాఖ్యలను విమర్శించడంతోపాటు సీఎం కేసీఆర్, ప్రధాని మోదీలనూ విమర్శించారు.
ఈ లేఖలో ‘ఈటల రాజేందర్ తన పదవికి రాజీనామా చేస్తూ కేసీఆర్ ఫ్యూడల్ పెత్తనానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడతానని, అందుకోసం ఆర్ఎస్‌ఎస్ నుంచి ఆర్‌ఎస్ యు వరకు కలసి పోరాడతానని ప్రకటన చేశారు. వెనువెంటనే హిందూ ఫాసిస్టు పార్టీ అయిన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేసీఆర్‌కు, ఈటలకు మధ్య కలహం ప్రజలకు సంబంధించింది కాదు.. వారిద్దరూ ఒకే గూటి పక్షులు’ అని విమర్శించారు. కేసీఆర్, ఈటల ఇద్దరు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు తూట్లు పొడిచారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో చెప్పిన ప్రజా సమస్యల పరిష్కారాన్ని మర్చిపోయి ప్రజాస్వామిక వాదులపై దమనకాండ చేస్తున్నారు. మొన్నటి వరకు కేసీఆర్ పక్కన అధికారాన్ని అనుభవించిన ఈటల తన ఆస్తులను పెంచుకునేందుకు యత్నించాడు. అందులో భాగంగానే అసైన్డ్ భూములను ఆక్రమించాడు. కేసీఆర్ బర్రెలు తినేవాడైతే ఈటల గొర్రెలు తినే ఆచరణ కొనసాగించారు. తెలంగాణలో ఫ్యూడల్ పెత్తనానికి వ్యతిరేకంగా ఆత్మగౌరవ పోరాటం చేస్తానని చెప్పి ఆస్తుల రక్షణ కోసం బీజేపీలో చేరాడు. నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ-హిందూత్వ ఫాసిజంతో దేశాన్ని సామ్రాజ్యవాదులకు అమ్మకానికి పెట్టింది. అణచివేతకు పాల్పడుతోంది. అందుకే హిందూత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా దేశంలో విశాఖ ప్రజలు ఏకమై పోరాడుతున్నారు. కేసీఆర్ నియంత పాలన,కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు పోరాడుతున్నారు. ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రజలను మోసం చేసి మళ్లీ హుజూరాబాద్ నుంచి గెలిచేందుకు ఆత్మగౌరవం కోసం పోరాడతానని చెబుతున్నారు. టీఆర్ఎస్‌లో ప్రధాన భూమిక పోషించిన ఈటల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఎన్నడో తుంగలో తొక్కారు. ఆర్ఎస్ఎస్, ఆర్‌ఎస్‌యూ లను ఒకే గాట కడుతున్నారు. దేశ చరిత్రలో చూస్తే ఆ రెండూ ఎప్పుడూ బద్ధ శత్రువులుగానే ఉన్నాయి. ఆర్ ఎస్ ఎస్ కి వ్యతిరేకంగా ఎప్పుడూ ఆర్ ఎస్ యూ పోరాటం చేస్తూనే ఉంటుంది. ఆర్ఎస్ఎస్‌తో పాటు, ఆర్ ఎస్ యు మావోయిస్టులు కూడా తనకు మద్దతు ఇస్తారని ఈటల చెప్పడం పచ్చి మోసంగా మా పార్టీ ప్రకటిస్తోంది. ఈటల తీసుకున్న నిర్ణయాలను ప్రజలు, ప్రజాస్వామిక వాదులు వ్యతిరేకిస్తున్నారు. బీజేపీలో చేరవద్దని, ప్రజాస్వామిక శక్తులతో కలసి కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాడాలని పలుమార్లు విన్నవించినా ఈటల నిస్సిగ్గుగా బీజేపీలో చేరారని, ఈ అవకాశ వాదాన్ని ప్రజలు తిప్పికొట్టాలని’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవ పోరాటం చేస్తానని ప్రకటించిన ఈటల రాజేందర్ తన ఆస్తుల రక్షణ కోసమే బీజేపీలో చేరారని వ్యాఖ్యానించారు.