చైనా, వుహాన్ లో మొదలైన కరోనా ప్రపంచ వ్యాప్తంగా 147 దేశాలకు పాకింది. ఇప్పటికే చాలా దేశాలలో సెకండ్ వేవ్ కూడా మొదలైంది. మనదేశంలో కూడా ఈ కేసులు రోజురోజుకు భారీగానే నమోదవుతున్నాయి. ఇప్పటికే దేశంలో 70 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా లక్ష మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారు. శ్వాసకోశ సంబంధిత ఈ జబ్బుకు వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేయదని శాస్త్రవేత్తలు నిర్దారించడంతో ఇండియన్ మెడికల్ కౌన్సిల్ (ఐసీఎంఆర్), డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) రంగంలోకి దిగాయి. వ్యాక్సిన్ సమర్థతను అంచనా వేస్తూ వ్యాక్సిన్ తీసుకున్న వారి భద్రత, వారి శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగిన విధానంపై విశ్లేషించి వ్యాక్సిన్ కు అనుమతులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ మహమ్మారికి వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ సంస్థలతో పాటు భారతీయ సంస్థలు ముందజలో ఉన్నాయి. వీటిలో భారత బయోటెక్ సంస్థ చాలా వేగంగా వ్యాక్సిన్ విడుదల చేయాలని రెడీ అవుతోంది. ఐసీఎంఆర్, పుణె వైరాలజీ ల్యాబ్ తో కలిసి భారత బయోటెక్ సంస్థ ‘ కోవాగ్జిన్’ వ్యాక్సిన్ సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ ఇప్పటికే మొదటి దశ విజయవంతంగా పూర్తి చేయగా తాజాగా రెండో దశ కూడా పూర్తి చేసినట్లు ఆ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. దీంతో మూడవ దశకు అనుమతి ఇవ్వాలని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాని కోరింది. అందుకు అనుమతిని మంజూరు చేసిన డీసీజీఐ రెండో దశ ట్రయల్స్ లో భాగంగా చేసిన పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని భారత బయోటెక్ ను ఆదేశించింది.
రెండో దశలో ఈ వ్యాక్సిన్ ను అన్నిరకాల జంతువులపై ప్రయోగించామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ వ్యాక్సిన్ ఇమ్మ్యూనిటిని పెంచడమే గాక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ నమోదు కాలేదని వెల్లడించారు. ఈ దశలో హ్యూమన్ ట్రయల్స్ కూడా ఈ సంస్థ నిర్వహించింది. దేశవ్యాప్తంగా 12 చోట్ల ఈ వ్యాక్సిన్ ను పలు ఆసుపత్రులలో మానవులకు ఇచ్చారు. 18-55 ఏళ్ల మధ్య వారికి ఈ వ్యాక్సిన్ ఇవ్వగా సమర్థవంతంగా పని చేసిందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ పురోగతిపై ఓ నివేదిక సిద్ధం చేశామని వాటిని త్వరలోనే డీసీజీఐకి అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్ సిద్ధం చేయడంలో అధునాతన సాంకేతిక కోసం విరోవ్యాక్స్ తో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ఈ వ్యాక్సిన్ వైరస్ పై దీర్ఘకాలం పాటు పోరాడుతుందని భావిస్తున్నట్టు సంస్థ ఎండీ ఎల్లా కృష్ణ తెలిపారు.











