సమగ్ర భూ సర్వే. ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఎవరి భూమి వారికి సమగ్ర హక్కులు కల్పించే కార్యక్రమం. అంటే భూములు ప్రజలవే కానీ ప్రభుత్వం కొలతలు వేసి సమగ్ర హక్కులు కల్పిస్తుందట. అంటే ఇప్పటిదాకా భూ యజమానులకు సమగ్ర హక్కులు లేవా? అనే అనుమానం రాక మానదు. ఇక ప్రజల భూములకు పాతే రాళ్లపై సీఎం జగన్మోహన్ రెడ్డి పేరు, చరిత్రలో నిలిచిపోయేలా రాతిపై చెక్కిన జగన్ చిత్రం ఉన్న సర్వే రాళ్లు వేయాలని అధికారులు చేసిన ప్రయత్నం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ప్రజల భూములపై ప్రభుత్వ పెత్తనమా?
భూములు ప్రజలవి, హక్కులు కూడా ఎవరి భూమిపై వారికే ఉంటుంది. తాజాగా ప్రభుత్వం సమగ్ర భూ సర్వే చేపట్టి ఎవరి భూములపై వారికి సమగ్ర హక్కులు కల్పిస్తామంటోంది. ఇప్పటి వరకూ భూములపై ప్రజలకు సమగ్ర హక్కులు లేవా? దీనికితోడు ప్రభుత్వం సర్వే జరిపించి సీఎం పేరు, బొమ్మలతో రాళ్లు పాతుకుంటారట. ఈ పథకానికి వైఎస్పార్ భూమి శాశ్వత హక్కు, జగనన్న భూమి శాశ్వత హక్కు అనే పేర్లలో ఏదో ఒకటి పెట్టుకుంటారట. ఇదంతా వినడానికే హస్యాస్పదంగా ఉంది. ప్రజల ఆస్తులకు మీ పేరు పెట్టుకోవాలని ప్రయత్నించడం అనేది చవకబారు టెక్నిక్ అని ప్రజలు నవ్వుకుంటున్నారు.
అధికారులు ఇంతగా దిగజారాలా?
రెవెన్యూ అధికారుల తీరు చూస్తుంటే సర్వే రాళ్లకే సుమారు రూ.32 వేల కోట్లు ఖర్చు చేయడానికి కూడా సిద్ధపడ్డారు. సమగ్ర భూ సర్వే రాళ్లను ప్రకాశం జిల్లాలో అరుదుగా దొరికే గ్రానైట్ రాళ్లతో సరిహద్దు రాళ్లు వేస్తారట. అంతేకాదు. ఆ సరిహద్దు రాళ్లపై సీఎం జగన్మోహన్ రెడ్డి పేరు, ఫోటోలను కష్టపడి చెక్కించారు. స్వామి భక్తిని చాటుకోవడానికి కూడా హద్దుండాలి. ఒక్క రాయికి రూ.4000 ఖర్చు చేయడానికి అధికారులకు ఎలా చేతులు వచ్చాయి. ఏపీ మొత్తం 2 కోట్ల భూ పట్టాలు ఉన్నాయి. వాటన్నింటికీ సరిహద్దు రాళ్లు వేయడానికి అధికారులు రూ.32 వేల కోట్లు ఖర్చు చేయడానికి కూడా వెనకాడలేదని భావించాల్సి ఉంటుంది. అదృష్ఠ వశాత్తూ ముఖ్యమంత్రి ఆ రాళ్లు వద్దన్నారు కాబట్టి సరిపోయింది. లేదంటే సమగ్ర భూ సర్వే పేరుతో భారీ దోపిడీకి తెరలేపేవారేమో.
అన్నా ఏందన్నా ఈ పేర్ల పిచ్చి…
ప్రభుత్వం పేదలకు ఉచితంగా పంచి ఇచ్చే సెంటు భూమి సరిహద్దులకు జగనన్న పేరు, ఫోటో పెట్టుకోండి. కానీ తరతరాలుగా వారసత్వంగా వస్తున్న, లేదా కష్టపడి సంపాదించుకున్న ప్రజల భూములకు సీఎం తండ్రి పేరు, కాదంటే జగన్ పేరు పెట్టుకోవడాన్ని ఎవరూ హర్షించరు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి ప్రతి పథకానికి తనపేరు పెట్టుకుంటూ వందల కోట్లు ప్రచారానికి ఖర్చు చేస్తున్నాడని విమర్శలు గుప్పించిన అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక చేస్తున్నది ఏమిటి? మంచి చేస్తే ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. బలవంతగా పేర్లు, పోటోలు పెడితే అధికారం కోల్పోయిన రోజే అన్నీ తుడిచిపెట్టుకుపోతాయని పాలకులకు తెలియదా. ఇప్పటికైనా ప్రచార ఆర్భాటాలు తగ్గించి, అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై దృష్టి సారిస్తే ప్రజల్లే పాలకుల ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.