జగన్ ప్రభుత్వానికి హై కోర్టులో మరోసారి చుక్కెదురయ్యింది. సినిమా టికెట్ ధరల నియంత్రణ చేసే అధికారం ప్రభుత్వానికి లేదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. టికెట్ ధరలను నిర్ణయించే అధికారం కేవలం లైసెన్సింగ్ అథారిటీ (జేసీ)కి మాత్రమే ఉందన్న కోర్టు, ప్రభుత్వం తమ అభిప్రాయం మాత్రమే తెలియజేయగలదని స్పష్టం చేసింది. అంతిమంగా టికెట్ ధరల నిర్ణయం అనేది లైసెన్సింగ్ అధారిటీ మాత్రమే చేస్తుందని రాష్ట్ర ప్రధాన న్యాయస్థానం తెలిపింది.
అదేసమయంలో ఆన్లైన్లో టికెట్ల అంశంలోనూ హై కోర్టు కీలక అంశాలను వెల్లడించింది. సర్వీసు చార్జీలను టికెట్ ధరల్లో కలపడానికి వీల్లేదని చెప్పింది. గతంలో విక్రయించినట్టుగానే పాత విధానంలోనే మల్టీప్లెక్స్‌లు టికెట్లను అమ్ముకోవచ్చని పేర్కొంటూ జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.ఇక ఈ అంశంలో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించిన న్యాయస్థానం తదుపరి విచారణను జూన్ 15కు వాయిదా వేసింది.