కరోనా సాయం పేరు చెబితే మనకు టక్కున గుర్దొచ్చే పేరు సోనూ సూద్. విలన్ పాత్రలు వేసే ఈ నటుడు ఇప్పుడు హీరో అయిపోయాడు. మరి తెలుగులో ఇలాంటి హీరోలు లేరా అంటే ఒకరున్నారు కానీ ఆయన హీరో కాదు నిర్మాత. పేరు చదలవాడ శ్రీనివాసరావు. కలప వ్యాపారంతో ఆయన కోట్లు సంపాదించినా సినిమాలు తీసి మాత్రం దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు పోగొట్టారు అని అందరూ అంటుంటారు. ఆయనను ఇప్పుడు చదలవాడ శ్రీనివాసరావు అనటం కన్నా ‘బిచ్చగాడు’ నిర్మాత అంటే బాగుంటుంది. కన్నతల్లి ఆరోగ్యం కోసం బిచ్చగాడుగా మారి తన సంపాదనను దానం చేసిన కోటీశ్వరుడి కథతో తీసిన ఆ సినిమా మాత్రం ఆయనకు మంచి విజయాన్ని అందించింది.
కరోనా బాధిత సినిమా కార్మికుల కోసం ఆయన కోట్లు కుమ్మరించ పోయినా అందరి కష్టాలనూ తెలుసుకుంటూ ఆదుకుంటూ ఉంటారు.
2000 కోట్లు సంపాదించిన వారు ప్రజా సంక్షమం కోసం 100 కోట్లు ఖర్చు చేస్తే పోయేదేమీ ఉండదు. కానీ 2000 కోట్లు పోగొట్టుకుని కూడా దానం చేయడానికి ముందుండటం వల్ల చదలవాడ శ్రీనివాసరావును ఇప్పుడు సినీ కార్మికులంతా తలచుకుంటున్నారు. ఆయన ఎంత ఖర్చు చేశారనటానికి లెక్కలేదు గానీ అందరినీ ఆదుకోవడానికి మాత్రం ముందుంటున్నారు. గతంలో రూ. 20,22,222 ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ద్వారా సహాయం అందించారు. డిస్ట్రిబ్యూటర్స్ కి , మీడియా వారికి ,ఫిలిం మీడియేటర్స్ కి ,పేస్టింగ్ బాయ్స్ కి, రిప్రజెంటేటివ్ల కి ,మేకప్, కాస్టూమ్స్ ,సెట్, పైటర్స్, లేడిడాన్సర్స్ సహాయకులకు, ఆర్టిస్ట్ నాన్ మెంబర్స్ కి ,కరోన కారణంగా రోజు గడవడానికి ఇబ్బంది పడుతున్నవారికి పంచాల్సిందిగా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకూ , ప్రొడ్యూసర్స్ సెక్టార్ చైర్మన్ యేలూరు సురేందర్ రెడ్డికి రూ. 10,11,111 అందజేశారు.
చిత్రపురి కాలనీలో ఇంటింటికీ శానిటైజర్, మాస్క్ లు అందించారు, మణికొండ 1 వ వార్డ్ కౌన్సిలర్ వల్లభనేని హైమాంజలి ఆధ్వర్యంలో దాదాపు 500 ఇళ్ళకు వీటిని అందించారు. డైరెక్టర్ల డ్రైవర్లు 26 మందికి కిట్స్ ఇచ్చారు. ఇటీవల మరణించిన సీనియర్ నటుడు రావి కొండలరావు గతంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకుని చదలవాడ స్పందించారు. లాక్‌డౌన్ సమయంలో ఆయన పడుతున్న ఇబ్బంది గురించి తెలుసుకుని రూ. 50 వేలు అందజేశారు. దాన్ని గురుదక్షిణగానే భావించాల్సిందిగా ఆయన రావి కొండలరావును కోరారు.
ఇలా చదలవాడ శ్రీనివాసరావు ఎన్నో సందర్భాల్లో తన దాతృత్వాన్ని చూపించుకున్న సందర్భాలు ఉన్నాయి. కొంతమంది నిర్మాతలు సినిమాలు నిర్మించి నష్టపోయినప్పుడు కూడా నేనున్నాను అంటూ చదలవాడ డబ్బు అందించేవారు. చదలవాడ శ్రీనివాసరావు చేపడుతున్న కార్యక్రమాలపై నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ సాయం చేయడమన్నది విచక్షణకు సంబంధించిన అంశమని తెలిపారు. చదలవాడ శ్రీనివాసరావు మాత్రం సినిమా వారికి ఆపద్భాంధవుడిగా కనిపిస్తున్నారని అన్నారు. సోనూ సూద్ , చదలవాడ లాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని అయినా మిగిలిన వారు ముందుకు రావాలని ఆయన కోరారు. మన పెద్ద హీరోలు పెద్ద పెద్ద సహాయక కార్యక్రమాలు చేపట్టినా వారి స్థాయికి ఇంకా ఎంతో చేయవచ్చని అన్నారు.











