అబ్బ ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు ఏపీ ముఖ్యమంత్రి నోటి నుంచి ప్రత్యేక హోదా మాట వినబడింది. ప్రత్యేక హోదాను తేవడంలో గత టీడీపీ ప్రభుత్వం విఫలమైందని ఊరువాడ తిరిగి ప్రచారం చేసిన జగన్ హోదా తెచ్చే సత్తా తనకుందని ప్రచారం చేసుకున్నాడు. కొంత మేరకు ఈ ప్రచారం జగన్ కు ఉపయోగపడింది. 2019లో జరిగిన ఎన్నికలలో ఘనవిజయం సాధించిన జగన్ ప్రత్యేక హోదాని తేవడంలో సఫలీకృతుడవుతాడని అందరూ ఎదురుచూశారు. కానీ ఎన్నికలలో విజయం సాధించి ఢిల్లీకి వెళ్లిన జగన్ అక్కడ జరిగిన మీడియా సమావేశంలో కాడిని దింపేశాడు. ప్రాంతీయ పార్టీలపై ఆధారపడకుండా బీజేపీకి పూర్తి మెజారిటీ రావడం మన దురదృష్టమని ఇప్పటికిప్పుడు ప్రత్యేక హోదా రాకపోవచ్చు అని జగన్ చెప్పుకొచ్చారు.
ఎన్నికల ప్రచార సమయంలో మన పిల్లల భవిష్యత్తు కోసం హోదా ఆవశ్యకత ఎంతో ఉందని ఘనమైన ఉపన్యాసాలు ఇచ్చిన జగన్ చాలా రోజుల తరువాత ప్రత్యేక హోదా విషయాన్ని ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ ఊసే ఎత్తని ఆయన హఠాత్తుగా ప్రత్యేక హోదా విషయాన్ని ప్రస్తావించడం రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తి రేపింది. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీ మేరకు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ కోరడం అందరిని ఆశ్చర్యచకితులు చేసింది. 74వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన జగన్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఏపీకి ప్రత్యేక హోదా భవిష్యత్తులో అయినా వస్తుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఇచ్చే వరకు గట్టిగా అడుగుతూనే ఉంటామని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా ఇప్పటికిప్పుడు ఇచ్చే అవకాశం లేదు గాని తాము మాత్రం అడుగుతూనే ఉంటామని అన్నారు. ఈ నేపథ్యంలో జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలను సందేహంలో పడేశాయని చెప్పక తప్పదు.
కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి హోదా తీసుకువస్తామని చాలా గొప్పగా చెప్పుకున్న జగన్ నుంచి ఇలాంటి బెళతనపు వ్యాఖ్యలు రావడం విడ్డురంగా ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కేంద్రం అండ లేనిది ప్రత్యేక హోదా రాదనే విషయాన్ని తెలిసి కూడా జగన్ ప్రజల మనోభావాలతో ఆడుకున్నాడని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. మొత్తం మీద ప్రత్యేక హోదా బండి పగ్గాలు తాను వదిలేశానని జగన్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేదికగా ప్రకటించి చేతులు దులిపేసుకున్నాడు.