వైఎస్ ఫ్యామిలీ అంటే… నిన్నటి దాకా పొరపొచ్చాలు లేని కుటుంబం కిందే లెక్క. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి బతికున్నంత కాలం ఆయన సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి ఫ్యామిలీ సహా… సమీప బంధువర్గమంతా కలిసికట్టుగానే కనిపించారు. అసలు ఈ కుటుంబంలో విభేదాలు అన్న మాటే వినిపించలేదు. అయితే అదంతా గతం. ఇప్పుడు ఏపీ సీఎంగా ఉన్న వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వైఖరి పుణ్యాన ఆ ఫ్యామిలీ ఎక్కడికక్కడ చీలిపోయినట్టుగా కనిపిస్తోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య… ఆ తర్వాత ఈ కేసు దర్యాప్తుపై మారిన జగన్ వైఖరితో వివేకా కూతురు డాక్టర్ సునీత జగన్‌కు దూరంగా జరిగారు. తన తండ్రి హత్య కేసును దర్యాప్తు చేయాలంటూ ఆమె ఏకంగా సీబీఐని కోరడం, ఆ మధ్య ఏకంగా కేరళ అభయ హత్య కేసులో కీలకంగా వ్యవహరించిన సామాజిక కార్యకర్తతో భేటీ కావడం పెను సంచలనే అయ్యింది. దీనిపై జగన్ మౌనమే దాల్చగా… ఇప్పుడు తన తోడబుట్టిన సోదరి వైఎస్ షర్మిల కూడా జగన్‌కు దూరంగా జరిగినట్టుగా వస్తున్న వార్తలు మరింత కలకలం రేపుతున్నాయి. తాజాగా జగన్ తల్లి వైఎస్ విజయమ్మ కూడా కూడా తన కుమారుడికి దూరంగా జరిగి కూతురితోనే సాగేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా వస్తున్న విశ్లేషణలు మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొత్తంగా అంత పెద్ద ఫ్యామిలీలో ఇప్పుడు జగన్ ఏకాకిగా మిగిలిపోయారా? అన్న దిశగా విశ్లేషణలు సాగుతున్నాయి.
షర్మిలకు పెద్ద పదవే లభిస్తుందని అంచనా వేసినా..
జగన్ జైలులో ఉండగా… తనదైన శైలిలో సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన వైఎస్ షర్మిల… వైసీపీ పురిట్లోనే చావకుండా కాపాడారు. అందుకు ప్రతిఫలంగా షర్మిలకు పార్టీలో పెద్ద పదవే లభిస్తుందని అందరూ అంచనా వేశారు. జగన్ సీఎం అయ్యాక కూడా షర్మిలకు అటు పార్టీలో గానీ ఇటు ప్రభుత్వంలో గానీ ఎలాంటి పదవి వరించలేదు. దీంతో జగన్ తత్వం బోధపడిన షర్మిల… అన్నకు దూరంగా జరిగారు. ఏపీని వదిలేసి తెలంగాణ కేంద్రంగా రాజకీయం నెరపేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకున్న ఆమె ఇటీవలే సొంత పార్టీ ఏర్పాటు దిశగా వడివడిగానే అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో జగన్, షర్మిలల మధ్య పూడ్చలేనంత అగాథం ఏర్పడిందన్న వాదనలు కలకలం రేపాయి. ఈ వార్తలను ఇటు జగన్‌గానీ, అటు షర్మిల గానీ ఏమాత్రం ఖండించకుండానే సాగుతున్నారు. ఈ నేపథ్యంలో వీరి మధ్య విభేదాలు నిజమేనన్న వాదనలకు మరింత బలం చేకూరిందనే చెప్పాలి.
వేడుకలో కనిపించింది వీరు ముగ్గురే..
ఇలాంటి తరుణంలో కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వైఎస్ విజయమ్మ ఎవరి పక్షాన నిలబడతారన్న విశ్లేషణలు మొదలుకాక ముందే… ఈ విషయానికి సంబంధించి ఫుల్ క్లారిటీ వచ్చినట్గుగా చెబుతున్నారు. ఇటీవల తమ బంధు వర్గానికి చెందిన ఓ వివాహ వేడుక హైదరాబాద్‌లో జరగగా… ఇంటి పెద్దగా విజయమ్మ హాజరు కాగా… ఆ వేడుకకు తల్లితో పాటు షర్మిల కూడా హాజరయ్యారు. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ వివేకా కూతురు సునీత కూడా విజయమ్మ, షర్మిల పక్కన కనిపించారు. వేడుకలో వీరు ముగ్గురే కనిపించారు. జగన్‌గానీ, ఆయన సతీమణి భారతి గానీ అక్కడ కనిపించలేదు. దీంతో జగన్‌కు ఇప్పటికే దూరంగా జరిగిన సునీత, షర్మిలలకు మద్దతుగా నిలిచేందుకే విజయమ్మ నిర్ణయించుకున్నారని, ఈ క్రమంలోనే సదరు వేడుకకు జగన్ రాకున్నా.. షర్మిల, సునీతలను వెంటేసుకుని విజయమ్మ ఆ వివాహ వేడుకకు హాజరయ్యారన్న వార్తలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొత్తంగా ఎంతో పెద్దదిగా తమ ఫ్యామిలీని నిత్యం చెప్పుకునే జగన్.. ఇప్పుడు ఒక్కొక్కరుగా తనకు దూరంగా జరుగుతుండగా… తానొక్కడే ఏకాకిగా మిలిగిపోవడం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- ఎవరు? ఎందుకు?ఎవరిపై.. షర్మిల వదిలిన బాణంపై ఎన్నో ఈక్వేషన్‌లు!