20 ఏళ్ల క్రితం రొమాంటిక్ కామెడీగా వచ్చిన ‘చిత్రం’ సినిమాను, ప్రేక్షకులు ఇంతవరకూ మరిచిపోలేదు. అందుకు కారణం ఆ కథలోని కొత్తదనం .. ఆ పాత్రల్లోని వైవిధ్యం అనే చెప్పాలి. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై వచ్చిన ఈ సినిమా ద్వారానే దర్శకుడిగా తేజ పరిచయమయ్యాడు. అలాగే హీరోగా ఉదయ్ కిరణ్ పరిచయం కూడా ఈ సినిమాతోనే జరిగింది. అప్పటివరకు తెలుగు తెరపై పరిగెడుతున్న ప్రేమకథలకు ఈ సినిమా కామా పెట్టేసి, కొత్త మలుపు తిప్పేసింది. టీనేజ్ లవ్ స్టోరీగా యూత్ పై ఈ సినిమా చూపిన ప్రభావం అంతాకాదు.
ఈ సినిమా యూత్ ను ఒక ఊపు ఊపేయడానికి కారణం తేజ కథాకథనాలతో పాటు, ఆర్పీ పట్నాయక్ అందించిన సంగీతం మరో కారణమని చెప్పుకోవచ్చు. ఈ సినిమాతో ఉదయ్ కిరణ్ లవర్ బాయ్ గా మారిపోయాడు .. కెరియర్ పరంగా తారాజువ్వలా దూసుకుపోయాడు. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ వచ్చేస్తోంది .. ‘చిత్రం 1.1’ టైటిల్ ను ఖరారు చేశారు.
‘చిత్రం’ సినిమాకి కొనసాగింపుగా కాకుండా కథ కొత్తగానే ఉండనుంది. ఈ ఏడాది ఈ సినిమా షూటింగును మొదలుపెట్టనున్నట్ట్టుగా తేజ అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశాడు.
ఈ సినిమాకి కూడా ఆర్పీ పట్నాయక్ సంగీతాన్ని అందిస్తూ ఉండటం విశేషం. ఇతర వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
ప్రస్తుతం తేజ .. ‘అలమేలుమంగ – వెంకటరమణ’ సినిమాకి సంబంధించిన పనులతో బిజీగా ఉన్నాడు. గోపీచంద్ కథానాయకుడిగా రూపొందనున్న ఈ సినిమా, సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్లో ఈ సినిమా షూటింగు మొదలుకానున్నట్టుగా చెబుతున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిర్మితం కానున్న ఈ సినిమాలో, కథానాయికగా కీర్తి సురేశ్ పేరు వినిపిస్తోంది .. ఆమె ఎంపిక విషయం ఇంకా ఖరారు కావలసి ఉంది.ఈ సినిమా తరువాత తేజ ‘చిత్రం 1.1’ ప్రాజెక్టును పట్టాలెక్కించవచ్చు.
Must Read ;- గోపీచంద్ మారుతి ‘పక్కా కమర్షియల్’ సెట్స్ పైకి ఎప్పుడు?