ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టాక… రాష్ట్రంలో హత్యలు, దాడులు పెరిగిపోయాయి.. బెదిరింపుల పర్వానికి అయితే అంతే లేదన్న రీతిలో పరిస్థితులు దిగజారాయన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. తమను, తమ పాలనను ప్రశ్నించే, విమర్శించే వారే లక్ష్యంగా సాగుతున్న ఈ దౌర్జన్యాల పరంపర ఇటీవలి కాలంలో మరింతగా పెరిగిపోయింది. పంచాయతీ ఎన్నికలు మొదలైన తర్వాత దాడుల పర్వం పతాక స్థాయికి చేరిపోగా… బెదిరింపులు లేని ప్రాంతమంటూ లేదంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి. ఇక బెదిరింపులు, దాడులకు లొంగిపోతే సరే గానీ… అక్కడికి కూడా ఆగని వైరివర్గం నేతలను హత్య చేసేందుకు కూడా జగన్ సర్కారు వెనుకాడటం లేదనే చెప్పాలి. ఇందుకు నిదర్శనమే తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ సర్పంచ్ అభ్యర్థి భర్త ఆత్మహత్యగా చెప్పుకోవాలి. అనుమానాస్పద మృతిగా నమోదైన ఈ కేసులో పోలీసులు చెబుతున్నట్లుగా ఇది ఆత్మహత్య కాదని, వైసీపీ వర్గం వారే హత్యకు పాల్పడి ఉంటారన్న వాదనలూ గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇందుకు కొనసాగింపుగా మంగళవారం రాష్ట్రంలో రెండు ప్రధాన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకటి విజయవాడలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కొమ్మారెడ్డి పట్టాభిరామయ్యపై దాడి… రెండోది టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అరెస్ట్, రిమాండ్.
మెజారిటీ పంచాయతీలను తమ ఖాతాలో వేసుకునేందుకు..
పంచాయతీ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఉన్నంత కాలం నిర్వహించేందుకు ససేమిరా అన్న వైసీపీ సర్కారు.. కోర్టుల్లో మొట్టికాయలు పడిన నేపథ్యంలో తప్పనిసరిగా ఎన్నికలకు సిద్ధమైపోయింది. కోర్టులు ఎన్నిసార్లు చీవాట్లు పెట్టినా తమ వైఖరిని మార్చుకోని వైసీపీ.. రాష్ట్రంలో మెజారిటీ పంచాయతీలను తమ ఖాతాలో వేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో వైరి వర్గానికి చెందిన ప్రత్యేకించి టీడీపీకి మద్దతుదారులుగా బరిలోకి దిగుతున్న వారిపై బెదిరింపులకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో చాలా చోట్ల టీడీపీ మద్దతుదారులకు బెదిరింపులు ఎదురయ్యాయి. వాటిని ఎదుర్కొని నిలిచిన వారిపై దాడులకు దిగింది. ఇందులో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం గొల్లలగుంట టీడీపీ సర్పంచ్ అభ్యర్థిని భర్త సబ్బెళ్ల శ్రీనివాసరెడ్డిపై బెదిరింపులకు దిగిన వైసీపీ నేతలు నామినేషన్ వేసేందుకు వీల్లేదని హుకుం జారీ చేశారు. అందుకు ఆయన ససేమిరా అనడంతో కిడ్నాప్ చేసి అడవిలోకి తీసుకెళ్లి కాళ్లు,చేతులు కట్టేసి హింసకు పాల్పడ్డారు. ఎలాగోలా బయటపడ్డ ఆయన మరునాడు తెల్లారేసరికల్లా చెట్టుకు ఉరేసుకుని వేలాడుతూ కనిపించారు. ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపగా… మిగిలిన జిల్లాల్లోనూ వైసీపీ బెదిరింపులు, దాడుల పర్వానికి ఏమాత్రం తెర దించడం లేదు.
వ్యూహాత్మకంగా అచ్చెన్న టార్గెట్..
ఇదిలా ఉంటే.. శ్రీకకుళం జిల్లాలో అచ్చెన్నాయుడి సొంతూరు నిమ్మాడ పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా అచ్చెన్న సమీప బంధువు అప్పన్నను బరిలోకి దించిన వైసీపీ… వ్యూహాత్మకంగా అచ్చెన్నను టార్గెట్ చేసింది. అప్పన్నను బెదిరించారన్న సాకును చూపి అచ్చెన్నను అరెస్ట్ చేసింది. గతంలో అరెస్ట్ మాదిరిగానే పక్కా ప్లాన్‌తో అచ్చెన్నను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆయనకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచి 14 రోజుల పాటు రిమాండ్‌కు తరలించింది. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఎదురుదాడికి దిగే అవకాశాలున్నాయన్న భావనతో.. .దానికి అడ్డుకట్ట వేసేలా విజయవాడలో పట్టాభిపై భౌతిక దాడికి దిగింది. ఇంటి నుంచి కారులో కార్యాలయానికి బయలు దేరిన పట్టాభిపై 10 మందికి పైగా గుర్తు తెలియని దుండగులు కర్రలతో విరుచుకుపడ్డారు. కొమ్మారెడ్డి కారుపై దాడికి దిగిన దుండగులు… కారు అద్దాలను పగులగొట్టి కొమ్మారెడ్డిని హత్య చేసేందుకు యత్నించారు. అయితే, కారు డ్రైవర్ చాకచక్యంగా కారును వేగంగా ముందుకు కదిలించడంతో కొమ్మారెడ్డి ప్రాణాలతో బయట పడగలిగారు. ఈ దాడిలో కొమ్మారెడ్డి కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో షాక్‌కు గురైన టీడీపీ శ్రేణులు నగరంలో పెద్ద ఎత్తున నిరసనకు దిగేందుకు యత్నం చేశారు. ఈ నిరసనలను కూడా సహించని వైసీపీ సర్కారు… ఎక్కడికక్కడ పోలీసు బలగాలను మోహరించి కొమ్మారెడ్డి గొంతును నొక్కేసింది.
వ్యతిరేకంగా మాట్లాడితే..
కొమ్మారెడ్డిపై దాడి ఇదే తొలి సారి కాదు. గతంలోనూ ఆయన ఇంటిపై దాడికి యత్నించిన దుండగులు ఇంటి బయట ఉంచిన కారును ధ్వంసం చేశారు. నాటి దాడిపై కొమ్మారెడ్డి ఫిర్యాదు చేసినా ఏదో అలా కేసు బుక్ చేసిన పోలీసులు ఇప్పటిదాకా నిందితులను పట్టుకోనేలేదు. ఈ క్రమంలో మరోమారు పట్టాభిపై దాడి జరిగిన తీరును చూస్తుంటే… తమకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని జగన్ ఏమాత్రం ఉపేక్షించేలా కనిపించడం లేదన్న మాట వినిపిస్తోంది. కొమ్మారెడ్డిపై ఏకంగా హత్యాయత్నం జరిగిన తీరుపై ఓ రేంజిలో ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు.. ప్రశ్నిస్తేనే చంపేస్తామన్న రీతిలో సాగుతున్న జగన్.. తాను కూడా వైసీపీని నిత్యం ప్రశ్నిస్తూనే ఉన్నాను కదా… నన్ను కూడా చంపేయండి అంటూ ఫైరయ్యారు. చంద్రబాబు ఈ రీతిలో స్పందించిన దాఖలా గతంలో ఎప్పుడూ లేదనే చెప్పాలి. వైసీపీ సర్కారు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిత్యం తనదైన శైలిలో సాక్ష్యాధారాలతో సహా ప్రశ్నిస్తున్న కారణంగానే కొమ్మారెడ్డిపై వరుస దాడులు జరిగాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదన్న వాదన కూడా బలంగానే వినిపిస్తోంది. మొత్తంగా… ఇటు కొమ్మారెడ్డిపై వరుస దాడులు, అటు అచ్చెన్నపై వరుస అరెస్టుల పర్వం, పంచాయతీ ఎన్నికల్లో బెదిరింపులు, దౌర్జన్యాలు, మాట వినని వారిని అంతమొందిస్తున్న తీరు చూస్తుంటే… జగన్ జమానా బెదిరింపులు, దాడులు, అరెస్ట్‌లు, హత్యలతోనే ముందుకు సాగుతోందనే విశ్లేషణలు సాగుతున్నాయి.
Must Read ;- మేమే గెలుస్తాం.. హోంమంత్రి అయి మీ సంగతి చూస్తా : అచ్చెన్న