ఈ వార్త వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నిజంగానే షాకేనని చెప్పాలి. జగన్ సొంత బాబాయి దివంగత వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు ఆదిలో ఓ మాదిరిగా కదిలినా.. జగన్ సీఎం అయ్యాక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో తన తండ్రిని హత్య చేసిన నిందితులకు ఇక శిక్ష పడదని భావించారో, ఏమో తెలియదు గానీ… వివేకా కూతురు సునీతా రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
కేసు దర్యాప్తును కూలంకషంగా పరిశీలిస్తూ వచ్చిన ఆమె… తాజాగా ఢిల్లీలో ఓ ప్రముఖ హక్కుల కార్యకర్తతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ ప్రముఖుడు అలాంటి ఇలాంటి వ్యక్తి కాదు. కేరళలో హత్యకు గురైన క్రైస్తవ సన్యాసిని అభయ హత్య కేసును పోలీసులు, సీబీఐ ఎంతగా తప్పుదోవ పట్టించినా… కేసు విచారణ ఏళ్ల తరబడి సాగినా… నిందితులకు శిక్ష పడేలా చేసిన ప్రముఖ హక్కుల కార్యకర్త జోమున్ పుతెన్ పురక్కల్. రెండు దశాబ్దాల పాటు అభయ కేసులో తనదైన శైలిలో న్యాయపోరాటం చేసిన జోమున్… ఎట్టకేలకు దోషులకు శిక్ష పడేలా చేశారు.

సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు పులివెందులలోని తన సొంతింటిలో వివేకా దారుణ హత్యకు గురయ్యారు. నాడు విపక్ష నేతగా ఉన్న జగన్ తన బాబాయి హత్యపై తీవ్రంగానే స్పందించారు. టీడీపీ అనుకూలురే తన బాబాయిని అంతమొందించారన్న కోణంలో సంచలన వ్యాఖ్యలు చేసిన జగన్… కేసును సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఎన్నికల హడావిడిలో పడిపోయిన జగన్ ఆ ఉదంతాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఎన్నికల్లో వైసీపీకి రికార్డు విక్టరీ లభించగా… జగన్ సీఎం పీఠం ఎక్కారు.
ఈ క్రమంలో తన సొంత బాబాయిని హత్య చేసిన నిందితులెవరన్న విషయాన్ని జగన్ నిగ్గు తేలుస్తారని అంతా భావించారు. అయితే అప్పటిదాకా సీబీఐ దర్యాప్తు అన్న జగన్… తానే సీఎం అయ్యాక ఆ మాట మార్చేశారు. రాష్ట్ర పోలీసులతోనే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించేందుకు సిద్ధపడ్డారు. జగన్ తీరును నిరసించిన వివేకా కుమార్తె సునీతా రెడ్డి… నేరుగా సీబీఐని ఆశ్రయించారు. ఈ క్రమంలో ఈ కేసు దర్యాప్తును ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అయితే ఇప్పటిదాకా ఈ కేసులో నిందితులెవరన్న విషయం వెల్లడి కాలేదు.
ఇలాంటి తరుణంలో ఢిల్లీకి వెళ్లిన సునీతా రెడ్డి… అభయ కేసులో నిందితులకు శిక్ష పడేలా తనదైన శైలిలో వ్యవహారాలు నడిపించిన ప్రముఖ హక్కుల కార్యకర్త జోమున్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. విడతలవారీగా జరిగిన ఈ భేటీలో ఆమె జోమున్ తో చాలా విషయాలు చర్చించారు. కేసులో ఇప్పటిదాకా చోటుచేసుకున్న పరిణామాలను ఆయనకు సునీతారెడ్డి వివరించారు. కేసు దర్యాప్తులో సాయం చేయాలని కోరారు. అందుకు జోమున్ కూడా సరేనన్నారు. ఆ తర్వాత సునీతారెడ్డి ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేయగా… జోమున్ కూడా తన సొంత రాష్ట్రం వెళ్లిపోయారు.
తాజాగా ఈ విషయంపై జోమున్ కొందరు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వివేకా హత్య కేసులో తన వద్ద కీలక సాక్ష్యాధారాలున్నాయని, వాటిని త్వరలోనే బయటపెడతానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకాది ముమ్మాటికీ హత్యేనని, ఇందులో కొందరి ప్రమేయం గురించి తనకు ఖచ్చితమైన అనుమానాలున్నాయని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అభయ కేసు మాదిరిగానే వివేకా హత్య కేసులోని నిందితులకు కూడా శిక్ష పడేలా చేస్తానని జోమున్ చెప్పుకొచ్చారు. మరి ఈ పరిణామంపై జగన్ శిబిరం ఎలా స్పందిస్తుందో చూడాలి.











