Issuance Of H 1b Visas Starting From September :
అగ్రరాజ్యం అమెరికాలో పనిచేయాలని దాదాపుగా అన్ని దేశాల వృత్తి నిపుణులు కోరుకుంటారు. ఈ కల సాకారంలో భారతయులే అధికమని చెప్పాలి. విదేశీయులలను ఇస్తున్న వీసాల్లో మెజారిటీ కోటా భారతీయ వృత్తి నిపుణులే చేజిక్కించుకుంటున్న చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. వృత్తి నైపుణ్యాల్లో ఇతర దేశాల వారిని మించి సత్తా చాటుతున్న భారతీయులు.. విదేశీయుల కోసం అమెరికా జారీ చేస్తున్న ఏ రకం వీసాలైనా మెజారిటీ వాటా దక్కించుకుంటున్నారు. ఇక అందరి నోటా నిత్యం వినిపించే హెచ్-1బీ వీసాల్లోనూ మనోళ్ల వాటానే అధికం. ఇలాంటి నేపథ్యంలో వచ్చే నెల (సెప్టెంబర్)లో మొదలు కానున్న హెచ్-1బీ వీసాలనూ వీలయినంత మేర చేజిక్కించుకునే దిశగా భారతీయులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మేరకు అటు అమెరికా నుంచే కాకుండా ఇటు భారత విదేశాంగ శాఖ నుంచి కూడా కీలక ప్రకటన విడుదలైంది.
ట్రంప్ శకం చీకటి యుగమే
ఇతరత్రా విషయాల్లో ట్రంప్ పాలన ఎలా ఉన్నా.. అమెరికాకు ఉపాధి నిమిత్తం వెళ్లే వారికి జారీ చేసే వీసాల విషయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాం చీకటి పాలనగానే చెప్పాలి. విదేశాల నుంచి వచ్చి అమెరికాలో మెజారిటీ ఉద్యోగాలనే కాకుండా.. ఆయా రంగాల్లో కీలక ఉద్యోగాలన్నీ విదేశీయులే ఎగురవేసుకుపోతున్నారని, ఈ పరిస్థితిని సమూలంగా ప్రక్షాళన చేసి.. మెజారిటీ కొలువులు అమెరికన్లనే దక్కేలా చేస్తానంటూ బరిలోకి దిగిన ట్రంప్.. విదేశీయులకు జారీ చేస్తున్న వీసాలు.. ప్రత్యేకించి హెచ్-1బీ వీసాల జారీపై లెక్కలేనన్ని ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో కొత్తగా అమెరికా వెళ్లాలని భావించిన వారితో పాటుగా అప్పటికే అమెరికాలో ఈ వీసాలపై పనిచేస్తున్న వివిధ దేశాలకు చెందిన వృత్తి నిపుణులు చాలా ఇబ్బందులు పడ్డారు. అక్కడి విదేశీయుల్లో.. ప్రత్యేకించి భారతీయుల్లో దాదాపుగా అక్కడే స్థిరపడిపోయేందుకు సిద్ధమైన వారు ట్రంప్ ఆంక్షల నేపథ్యంలో తిరిగి తమ స్వదేశాలకు వెళ్లక తప్పలేదు. ఈ కారణంగా అమెరికా కేంద్రంగా పనిచేసే కంపెనీలతో పాటుగా ఆ దేశ కంపెనీలు కూడా వృత్తి నిపుణుల కొరతతో సతమతమయ్యాయి.
బైడెన్ హామీ అమలైనట్లే
తాను అధికారంలోకి వస్తే.. విదేశీయులకు జారీ చేస్తున్న వీసాల నిబంధనలను సరళతరం చేస్తానని, తద్వారా అమెరికా కంపెనీలతో పాటుగా దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తానని అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అనుకున్నట్లుగానే బైడెన్ అధికారంలోకి రాగానే.. వీసాల జారీపై ట్రంప్ హయాంలో కొనసాగిన ఆంక్షలను ఒక్కటొక్కటిగానే సడలిస్తూ వస్తున్నారు. ఇలాంటి క్రమంలో హెచ్-1బీ వీసాల జారీ ప్రక్రియను కూడా సరళతరం చేయడంతో పాటుగా వచ్చే నెల నుంచి వాటిని జారీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇదే విషయాన్ని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా ప్రకటించారు. సెప్టెంబర్ ప్రథమార్థం నుంచి హెచ్-1బీ వీసాల జారీ ప్రారంభం కానుండగా.. ఇతరత్రా వీసాల జారీ సెప్టెంబర్ మాసం చివరలో ప్రారంభం కానుందని ఆయన చేసిన ప్రకటన భారతీయ వృత్తి నిపుణుల్లో కొత్త ఆశలను చిగురింపజేసింది.
Must Read ;- హీరో గడ్డ తాలిబాన్ల అంతు చూసింది