నిజమే.. కరోనా టైం అందరికీ కష్ట కాలంగానే పరిణమించింది. వ్యక్తులతో పాటు వ్యవస్థలు కూడా కుప్పకూలాయి. ఇక ప్రభుత్వాల పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు. సమకూరే ఆదాయం ఒక్కసారిగా తరిగిపోగా.. పాలనా నిర్వహణతో పాటుగా కొత్తగా కరోనా నివారణ చర్యలకు ఇబ్బడిముబ్బడిగా ఖర్చు చేయాల్సి వచ్చింది. వెరసి అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే దశకు చేరుకున్నాయి. ఇందుకు భారత్ పరిస్థితి కూడా ఏమీ భిన్నం కాదు. దేశ ఆర్ధిక వ్యవస్థతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి కూడా అంతకంతకూ విషమ పరిస్థితికి చేరింది. అయితే కరోనా కష్ట కాలంలోనూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలోని నవ్యాంధ్రప్రదేశ్ ఆదాయం మాత్రం పెరిగింది. నిజంగానే ఇది వింత కిందే లెక్క. ఎంత పెరిగిందేమిటి అంటారా?.. 2019-20 ఆర్థిక సంవత్సరం కంటే..2020-21 ఏడాదిలో రూ.10 వేల కోట్ల మేర ఏపీ ఆదాయం పెరిగింది.
ఆదాయం ఎలా పెరిగింది?
కరోనా కాలంలో అన్ని దేశాలతో పాటు అన్ని రాష్ట్రాలు ఆదాయం తగ్గిపోగా.. ఒక్క ఏపీకి మాత్రమే ఆదాయం ఎలా పెరిగింది? నిజమే.. ఎవరికైనా ఈ అనుమానం సహజమే. ఇందుకు సమాధానం కూడా ఉంది. తెలుగు నేల సత్తా కలిగిన సాంకేతిక నిపుణులకు కేరాఫ్ అడ్రెస్సే కాదా. టెక్నాలజీ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్ ల సారథ్య బాధ్యతలు ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉన్నాయన్న విషయాన్ని ఓ సారి మననం చేసుకుంటేనే.. తెలుగోళ్లు సాంకేతిక పరిజ్ఞానంలో ఏ పాటి ఘనాపాటిలో ఇట్టే చెప్పేయొచ్చు. ఇలా సాంకేతిక పరిజ్ఞానంలో పట్టు సాధించిన వారంతా ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లారు. కొందరు దేశంలోని బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ లలో కార్యకలాపాలు సాగిస్తున్న సాఫ్ట్ వేర్ కంపెనీల్లో పనిచేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఆయా కంపెనీలు వర్క్ ఫ్రం హోం విధానాన్ని అవలంబించాయి కదా. ఈ క్రమంలో ఆయా నగరాల్లో సెటిల్ వారు మినహా మిగిలిన వారంతా తమ స్వస్థలాలకు వచ్చేశారు. ఈ విషయంలో తెలంగాణది ఓ భిన్నమైన పరిస్థితి అయితే.. ఏపీది దానితో పోలిక లేని పరిస్థితి. ఎందుకంటే.. తెలంగాణలో సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉన్న నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం పెరిగితే.. అక్కడి నుంచి జనం తమ ఊళ్లకు వెళ్లిపోయారు. అంటే ఆ రాష్ట్రానికి చెందిన వారు వర్క్ ఫ్రం హోం చేసినా, కార్యాలయాలకు వెళ్లినా.. పెద్దగా తేడా రాదనే చెప్పాలి. అదే ఏపీ విషయానికి వస్తే.. ఏపీలో సాఫ్ట్ వేర్ కంపెనీలు లేవు కదా. అంటే.. ఏపీకి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, ఇతర రంగాలకు చెందిన వృత్తి నిపుణులు ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు వెళ్లి పని చేయాల్సిందే. వీరంతా వర్క్ ఫ్రం హోం పేరిట స్వస్థలాలకు చేరారంటే.. వారి వస్తు వినియోగం వల్ల ఏపీలో వ్యాపార కార్యకలాపాలు పెరిగినట్టే కదా. అందుకే ఇతర ఏ రాష్ట్రంలో కనిపించని విధంగా ఏపీలో కరోనా కాలంలోనూ రాష్ట్ర ఆదాయం పెరిగింది.
ఆదాయం పెరిగినా బీద అరుపులేల?
ఓ పక్క కరోనా ఎఫెక్ట్ తో అన్ని దేశాలు, రాష్ట్రాలు తమ ఆదాయం సన్నగిల్లుతున్న వైనాన్ని చూసి ఆందోళనలో కూరుకుపోయాయి. అయితే ఏపీ సర్కారు మాత్రం కరోనాలోనూ ఆదాయం పెరిగినా.. ఆందోళనలో కూరుకుపోయినట్లుగా కనిపించింది. మరి ఆదాయం పెరిగినా.. ఆందోళన కనిపించిందంటే.. ఏపీ సర్కారు తనదైన శైలి నటనను ప్రదర్శించినట్టే కదా. అప్పటికే రాష్ట్ర ఆదాయాన్ని, అప్పులను పరిగణనలోకి తీసుకోకుండా సంక్షేమ పథకాలంటూ ఎడాపెడా ఖర్చులను పెంచేసిన జగన్ ప్రభుత్వం.. ఆయా పథకాల కోసమే కాకుండా ఏకంగా.. ఉద్యోగుల వేతనాల కోసం కూడా అప్పులు చేయాల్సి వచ్చిన పరిస్థితి స్పష్టంగానే కనిపిస్తోంది కదా. ఇలాంటి నేపథ్యంలో ఏదో అలా ఆయా రంగాల నిపుణుల వర్క్ ఫ్రం హోం కారణంగా పెరిగిన రూ.10 వేల కోట్ల ఆదాయం జగన్ సర్కారు అవరాలను ఏమాత్రం తీరుస్తుంది? అందుకే పెరిగిన ఆదాయాన్ని బయటపెట్టకుండా.. ఆర్థిక లోటును చూపుతూ అందినకాడికంతా అప్పులు చేసి పారేసింది. ఏదేమైనా.. కరోనా కష్ట కాలంలోనూ ఆదాయం పెరిగిన రాష్ట్రంగా ఏపీ చరిత్ర పుటల్లోకి ఎక్కడం ఖాయమేనన్న వాదన వినిపిస్తోంది.
Must Read ;- నాలుగో ప్లేస్ నుంచి జారి ఎక్కడ పడ్డాడో?