Big Shock To Talibans In Panjsheer Of Afghanistan :
అమెరికా బలగాలు వైదొలగగానే.. ఆ సమయం కోసం కాసుక్కూర్చున్నట్లుగా కనిపించిన తాలిబాన్ ఉగ్రవాదులుర ఆఫ్ఘనిస్థాన్ పై విరుచుకుపడ్డారు. దేశంలోని దాదాపుగా అన్ని ప్రాంతాలను తమ స్వాధీనంలోకి తీసుకున్న తాలిబాన్లు.. అధ్యక్ష భవనంతో పాటు భారత నిధులతో నిర్మితమైన పార్లమెంటు భవనాన్ని కూడా తమ స్వాధీనంలోకి తీసుకుంది. ఆ తర్వాత వరుసగా దేశంలోని పలు ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటూ సాగుతున్న తాలిబాన్లు నిన్నటిదాకా పంజ్ షీర్ ప్రాంతం వైపు దృష్టి సారించలేదు. ఎందుకంటే.. ఆ ప్రాంతం శత్రు దుర్భేద్యంగా ఉండటంతో పాటు అక్కడి ప్రజలు దేశంపైకి దాడి చేసే వారిని చిత్తుచిత్తుగా ఓడించి పరుగులు పెట్టించిన చరిత్ర కలిగినవారు. దీంతోనే దేశం మొత్తాన్ని స్వాధీనంలోకి తీసుకున్న తర్వాతే పంజ్ షీర్ వైపు వెళ్లొచ్చన్న దిశగా తాలిబాన్లు భావించారు. అయితే సోమవారం నాడు పంజ్ షీర్ వైపు వెళ్లిన తాలిబాన్లకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. పంజ్ షీర్ స్వాధీనం కోసం వెళ్లిన 800 మంది తాలిబాన్లను పంజ్ షీర్ వాసులు మట్టుబెట్టేశారట. దీంతో మిగిలిన తాలిబాన్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగు లంకించుకున్నారట.
ఇది నేషనల్ హీరో ప్రాంతం
ఆఫ్ఘన్ నేషనల్ హీరో అహ్మద్ షా మసూద్ గురించి ఇప్పటికే ఓ సారి చెప్పుకున్నాం కదా. పంజ్ షీర్ ప్రాంతానికే చెందిన షా.. గతంలో తాలిబాన్ల చెర నుంచి ఆఫ్ఘన్ కు విముక్తి లభించడంలో కీలక భూమిక పోషించిన వైనం కూడా చెప్పుకున్నాం కదా. ఇప్పుడు షా తనయుడు అహ్మద్ మసూద్ కూడా తాలిబాన్లకు లొంగకుండా.. దేశం నుంచి ఆ ఉగ్రవాదులను ఎలా తరిమికొట్టాలన్న దిశగా వ్యూహాలు రచిస్తున్నారు. సైన్యంలోని దేశ భక్తులు, రాజకీయ నేతలు కూడా ఆయనతో కలిసి ఈ వ్యూహాల రచనలో నిమగ్నమయ్యారు. చుట్టూ పర్వతాలతో ఉన్న పంజ్ షీర్ లో అడుగుపెట్టాలంటే.. ఒకే ఒక్క దారి మాత్రమే ఉంది. ఎవరైనా ఈ దారి ద్వారానే పంజ్ షీర్ లోకి వెళ్లాలి. ఈ మార్గం వద్దే కాపు కాసిన పంజ్ షీర్ వీరులు తాలిబాన్ ఉగ్రవాదులకు చుక్కలు చూపించారు. ఒకేసారి 800 మంది తాలిబాన్లను మట్టుబెట్టిన పంజ్ షీర్ వాసుల వీరోచితం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ వార్తగా మారిపోయింది. చిక్కిన వారిని చిక్కినట్టుగా చంపేసిన పంజ్ షీర్ వాసులు ఏకంగా తాలిబాన్ కమాండర్ సలావుద్దీన్ ను రౌండప్ చేశారట.
అప్పుడు తండ్రి.. ఇప్పుడు కొడుకు
1996లో ఆఫ్ఘన్ ను తాలిబాన్లు ఆక్రమించేశారు. అన్ని వ్యవస్థలు తాలిబాన్లకు లొంగిపోయినా.. అప్పటికే రష్యా సేనలకు కూడా చుక్కలు చూపించిన అహ్మద్ షా మసూద్ మాత్రం తలొగ్గలేదు. ఆఫ్ఘన్ సైన్యం తాలిబాన్లకు లొంగిపోయిన నేపథ్యంలో.. విదేశీ సేనల సాయాన్ని కోరుతూ తనదైన శైలిలో సత్తా చాటిన షా.. ఆఫ్ఘన్ వైపు విదేశాలన్నీ చూసేలా చేశారు. తాలిబాన్ల దాడిలో షా మరణించిన నెలల వ్యవధిలోనే నాటో బలగాలు ఆఫ్ఘన్ లో అడుగుపెట్టి ఆఫ్ఘన్ ప్రజలకు తాలిబాన్ల నుంచి విముక్తి కల్పించాయి. ఇప్పుడు షా కుమారుడు అహ్మద్ మసూద్.. పంజ్ షీర్ కేంద్రంగా తాలిబాన్ వ్యతిరేక వ్యూహాలకు పదును పెడుతున్నారట. అధ్యక్షుడు ఘనీ పారిపోయినా.. ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్.. అహ్మద్ మసూద్ బృందంతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం పంజ్ షీర్ లోనే తిష్ట వేసిన ఆ దేశ రాజకీయ ప్రముఖులంతా అహ్మద్ మసూద్ నేతృత్వంలో తాలిబాన్లపై తిరుగుబాటు వ్యూహం రచిస్తున్నారట. ఈ వ్యూహాల ఫలితంగానే ఇప్పుడు తాలిబాన్లకు భారీ ఎదురు దెబ్బ తగిలిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వ్యూహాల్లో తండ్రి మాదిరే అహ్మద్ మసూద్ కూడా సక్సెస్ అయితే.. తాలిబాన్లు ఇకపై ఆఫ్ఘన్ వైపు కన్నెత్తి చూడలేరనే చెప్పాలి.
Must Read ;- ఇండియన్స్ కు అమెరికా గుడ్ న్యూస్