Payyavula vs Buggana :
ఏపీలోని జగన్ ప్రభుత్వం ఆర్ధిక నిర్వహణలో అడ్డంగానే బుక్కైందన్న వాదనలు కలకలం రేపుతున్నాయి. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి అత్యుత్సాహం.. సీఎం జగన్ ను అడ్డంగా బుక్ చేసిందన్న వాదనలూ వినిపిస్తున్నాయి. రూ.41 వేల కోట్లకు లెక్కలెక్కడ అంటూ పీఏసీ చైర్మన్ హోదాలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మొన్న గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై వెనువెంటనే స్పందించాల్సిన బుగ్గన.. పయ్యావుల ఆరోపణలు చేసిన తర్వాత నాలుగు రోజులకు మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా పయ్యావుల లేవనెత్తిన ఆరోపణలకు నేరుగా సమాధానం ఇవ్వని బుగ్గన.. రాజకీయ ఆరోపణలు చేస్తూ అడ్డంగా దొరికిపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
బుగ్గనపై పయ్యావుల ఫైరింగ్
బుగ్గన మీడియా సమావేశం ముగిసిన మరుక్షణమే రంగంలోకి దిగిపోయిన పయ్యావుల.. ఏపీ ప్రభుత్వ తీరుపై ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. తాను ఏడు నిమిషాలు మాట్లాడితే.. బుగ్గన 55 నిమిషాల సమాధానం చెప్పారని, అయితే తాను అడిగిన అంశాల్లో ఒక్కదానికి కూడా వివరణ లేదని తేల్చేశారు. కేవలం రాజకీయ విమర్శలకే ప్రాధాన్యం ఇచ్చిన బుగ్గన.. అన్ని వ్యవస్థలదీ తప్పేనని, తామొక్కరమే మేధావులమన్న రీతిలో వ్యవహరిస్తున్నారని కూడా పయ్యావుల సెటైర్లు సంధించారు. బుగ్గనను మేధావిగా పరిగణించేందుకు తమకేమీ ఇబ్బంది లేదని, బేషజాలు అంతకంటే కూడా లేవని పయ్యావుల తనదైన శైలి చెణుకులు విసిరారు. అయితే ఓ బాధ్యతాయుతమైన ఆర్థిక మంత్రి హోదాలో ఉన్న బుగ్గన నుంచి డీసెంట్ రిప్లైనే ఆశిస్తామని ఆయన చెప్పారు. ఈ వ్యాఖ్యలతో బుగ్గన చిల్లరగానే వ్యవహరిస్తున్నారని పయ్యావుల ఎస్టాబ్లిష్ చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. తన ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు మూడు రోజుల సమయం ఎందుకు పట్టిందని ఆయన ప్రశ్నించారు.
ఆ రూ.25 వేల కోట్ల మాటేమిటి?
ఇప్పటికీ తాను మరిన్ని అంశాలను ప్రస్తావిస్తున్నానని చెప్పిన పయ్యావుల.. ఏపీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసిన జగన్ సర్కారు.. దానికి రూ.25 వేట కోట్ల అప్పుకు బ్యాంకుకు గ్యారెంటీ ఇచ్చిందని చెప్పారు. ఈ విషయాన్ని అసెంబ్లీకి తెలపాల్సి ఉన్నా.. ఎందుకు దాచారని పయ్యావుల ప్రశ్నించారు. అసలు రూ.25 వేల కోట్ల రుణాలను ప్రభుత్వ ఖజానాకు కాకుండా నేరుగా కార్పొరేషన్ ఖాతాకే వెళ్లేలా బ్యాంకులకు ఎందుకు ఆదేశాలు జారీ చేశారని కూడా ప్రశ్నించారు. ఇదంతా చూస్తుంటే.. ఉద్దేశపూర్వకంగానే చేశారని అర్థమవుతోందన్నారు. ప్రభుత్వ అప్పులు, గ్యారెంటీలకు సంబంధించి తాను వివరాలు కోరితే.. ఏడాది తర్వాత అసెంబ్లీ బుక్కుల్లో చూసుకోమని సింగిల్ లైన్ సమాధానం చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సింగిల్ లైన్ ఆన్సర్ కూడా అసెంబ్లీ కార్యదర్శి ఏడుసార్లు రిమైండర్లు పంపితేనే వచ్చిందన్నారు. రూ.25 వేల కోట్ల రుణాన్ని అసెంబ్లీ బుక్కులో పొందుపరచని వైనంతోనే తాను రంగంలోకి దిగినట్లుగా పయ్యావుల చెప్పారు.
జగన్ ఇరుక్కన్నట్లేగా
ఇక చివరగా.. ఈ విషయాలపై డిల్లీకి వెళ్లి మాట్లాడాలని బుగ్గన చేసిన వ్యాఖ్యలపై పయ్యావుల తనదైన శైలిలో సెటైర్లు సంధించారు. అసలు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నదెవరో ప్రజలందరికీ తెలుసన్నారు. బుగ్గన చెబుతున్నారు కాబట్టి.. తాను కూడా ఢిల్లీకి వెళతానని, రాష్ట్ర ప్రభుత్వ ఆర్ఙిక క్రమశిక్షణారాహిత్యంపై కేంద్ర ప్రభుత్వవానికి ఫిర్యాదు చేస్తానని, ఇతరత్రా కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేస్తానని పయ్యావుల సంచలన ప్రకటన చేశారు. అయినా ఆర్థిక నిర్వహణపై బుగ్గన చెప్పేవన్నీ బుర్ర కథలేనని, మంత్రి ఇలాగే ముందుకు సాగితే.. బుర్ర కథలను కాస్తా.. బుగ్గన కథలుగా మార్చుకోవాల్సి వస్తుందని చెప్పారు. మొత్తంగా పయ్యావుల కామెంట్లపై బుగ్గన స్పందించకున్నా బాగుండేదేమో గానీ.. అనవసర వ్యాఖ్యలు చేసి సీఎం జగన్ ను అడ్డంగా బుక్ చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- వడ్డీ ఎంతైనా పర్లేదు!.. అప్పు కావాలంతే!