GHMC ఎన్నికల తరువాత ఈ ప్రభుత్వం ఉండదు.. కూలిపోతది.. పోలీసులకు సూచిస్తున్నా.. ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిప్రభుత్వం కాదు..అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించడం రాజకీయవర్గాల్లో చర్చకు కారణమైంది. ఆయన గతంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంతకంటే గట్టిగానే విమర్శించినా.. కేసీఆర్ ని జైలుకు పంపిస్తామని వ్యాఖ్యానించినా.. ఈ రీతిలో మాత్రం ఇప్పటివరకు చెప్పలేదు. కరీనంగర్ లో హిందూ సమ్మేళన్ కేసీఆర్ పై, మరో వర్గంపై కొంత అసభ్యకరమైన పదాలు వాడిన సంజయ్.. ఈ సారి డిఫరెంట్ గా వ్యాఖ్యలు చేయడంపైనే చర్చ నడుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ- టీఆర్ఎస్ అన్నట్లు కనిపిస్తోంది.
ఇక జీహెచ్ఎంసీ ఎన్నికలను బీజేపీ జాతీయ నాయకత్వం కూడా సీరియస్ గానే తీసుకుంది. ముఖ్య నాయకులుకూడా వస్తున్నారు. ఆదివారం అమిత్ షా కూడా రానున్నారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వర్షంలో తడస్తూ రోడ్ షో చేశారు. ఈ నేపథ్యంలో దుబ్బాకలో గెలిచిన బీజేపీ అదే స్పీడ్ తో జీహెచ్ఎంసీ లో గెలవాలని చూస్తుందా..ఆ గెలుపు ఒక్క తెలంగాణ కే పరిమితమా అంటే కాదని చెప్పవచ్చు. ఆ పార్టీ ముఖ్యనాయకులు కూడా దక్షిణాదిలో అడుగుపెట్టేందుకు తెలంగాణను గేట్ వేగా భావిస్తున్నారని చెప్పవచ్చు.
ఇక తాజాగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే..కొన్ని అంశాలు రాజకీయవర్గాల్లో చర్చకు కారణమయ్యాయి. రానున్న కాలంలో కేసీఆర్ ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు జరగనున్నాయనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆదీనంలో నడిచేవి అనే అభిప్రాయం ఉన్న కొన్ని వ్యవస్థలు కేసీఆర్ పై టార్గెట్ చేయవచ్చు. అది ఏ రూపేణా అనేది ఇప్పుడే చెప్పలేం. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో, మిషన్ భగీరథ లో అవినీతి చోటుచేసుకుందని, తమ వద్ద ఆధారాలున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న టైంలో లక్ష్మణ్ ప్రెస్ మీట్ పెట్టారు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక సమయం నుంచి బీజేపీ ఈ ప్రకటనలు చేసింది. తరవాతి కాలంలో సైలెంట్ అయింది. దీనిపై కాంగ్రెస్ కూడా విమర్శలు చేసింది. బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటేనని కాంగ్రెస్ విమర్శలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
కేసీఆర్ మార్గమేనా..
గతంలో కేసీఆర్ ప్రాంతీయవాదం తో రాజకీయం చేస్తే.. బీజేపీ హిందూత్వంతో జీహెచ్ఎంసీలో రాజకీయం చేస్తోందనే విమర్శలున్నాయి. అంటే కేసీఆర్ చూపించిన రాజకీయ చాణక్యత..బీజేపీ ప్రదర్శిస్తోంది. మార్గం వేరైఉండవచ్చు. లక్ష్యం ఒక్కటే. ఇప్పడు ఈ అంశం ఎందుకంటే.. దశాబ్దకాలం పాటు వెనక్కి వెళ్తే.. టైగర్ నరేంద్ర ఇష్యూ తెరపైకి తీసుకురావాల్సి ఉంటుంది. టైగర్ నరేంద్రపై ఓ కేసు దర్యాప్తుకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఆదేశాలు ఇవ్వనుందని జాతీయ స్థాయి మీడియాలో కథనం వచ్చింది. ఆ దర్యాప్తునకు ముందురోజే.. టైగర్ నరేంద్రను పార్టీనుంచి సస్పెండ్ చేస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. ఇదే కోణాన్ని బీజేపీ వాడుకుంటుందా అనే చర్చ కూడా నడుస్తోంది. ఎందుకంటే కేసీఆర్ ను డైరక్ట్ టార్గెట్ చేస్తే.. ప్రజల్లో బీజేపీ పట్ల వ్యతిరేక భావం వచ్చే అవకాశం ఉంటే.. మార్గం మార్చుకుంటుందని చర్చ నడుస్తోంది. అందుకు గాను.. ఆయన పార్టీకి చెందిన ముఖ్యులు లేదా సంబంధీకులను ‘తమదైన’ విధంగా టార్గెట్ చేస్తే.. తద్వార తమ లక్ష్యం నెరవేర్చుకునే అవకాశం ఉంటుందని బీజేపీ వచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
మోదీ పర్యటన వివాదం..
ఇక భారత్ బయోటెక్ లో తయారు అవుతున్న కొవిడ్ 19 వ్యాక్సిన్ పై సమీక్షించేందుకు ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చారు. అయితే ఈ కార్యక్రమానికి కేసీఆర్ దూరంగా ఉన్నారు. కారణాలు అధికారికంగా వెల్లడి కాలేదు.. అయితే రాజకీయంగా ఇది దుమారం రేపనుంది. ప్రధాని కార్యాలయంనుంచి సరైన రీతిలో ఆహ్వానం రాలేదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రధాని వచ్చినప్పుడు సీఎం లేదా సీఎం పంపిన ప్రత్యేక ప్రతినిథి రిసీవ్ చేసుకోవడం బాధ్యత అని బీజేపీ చెబుతోంది. ప్రొటోకాల్ ప్రకారం అధికారులు వెళ్లినా.. కేసీఆర్ వెళ్లకపోవడం చర్చనీయాంశమైంది. మరోవైపు.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మోదీ టూర్ చాలా తక్కువ సేపు ఉంటుందని, కేవలం తెలంగాణలోనే కాదని.. పూణె పర్యటన విషయంలోనూ మహారాష్ట్ర సీఎంకి ప్రత్యేక ఆహ్వానం ఏమీ లేదని బీజేపీ చెబుతోంది.
కేసీఆర్ ఊహించారా..
కొన్నాళ్ల క్రితం కేసీఆర్ ఆ పార్టీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబరు 1తరువాత తాను బీజేపీపై యుద్ధం ప్రకటిస్తానని చెప్పారు. బీజేపీయేతర సీఎంలు, ముఖ్యనాయకులతో సమావేశం కూడా పెడతాననని చెప్పారు. నిధుల ఎలా ఈయరో చూస్తానని చెప్పారు. అయితే గతంలో ఫెడరల్ ఫ్రంట్ కోసం కూడా కేసీఆర్ యత్నాలు చేసిన నేపథ్యంలో కేసీఆర్ తాజాగా చేసిన ప్రకటనకూడా అలాంటిదేనని అంతా భావించారు. ఇక కేటీఆర్ ను సీఎం చేసి కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాల్లో బిజీ కానున్నారనే మరో చర్చ కూడా నడిచింది. అయితే జరుగుతున్న పరిణామాలన బట్టి చూస్తే.. రాజకీయ చాణుక్యుడిగా పేరున్న కేసీఆర్.. బీజేపీ నెక్ట్ స్టెప్ ని ముందుగానే ఊహించి ఉంటారేమో అనే చర్చ మొదలైంది. ఇక్కడే మరో విషయంకూడా ఉంది.. ఇతర రాష్ట్రాల సీఎంలు వేరు.. కేసీఆర్ వేరు.. కేసీఆర్ తో అంత ఈజీ కాదు.. కేసీఆర్ జననాడీని పట్టగలిగిన నేత..ఒక్క స్పీచ్ తో ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించగలిగే.. వాక్య్చాతుర్యం ఉన్న నేతగా పేరుంది. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కాకతాళీయమా..లేక బీజేపీ వ్యూహం ఉందా అనేది కాలమే నిర్ణయించాలి. ఇవన్నీ బయట అంతర్గతంగా వివిధ పక్షాల్లో నడుస్తున్న రాజకీయ చర్చలే.











