మాటల తూటాలు.. పంచ్ ల వర్షం.. వైరిపక్షాలను జాతీయ స్థాయినుంచి గల్లీ స్థాయి వరకు ఉతికిఆరేసే పదజాలం.. సందర్భానికి తగినట్టు.. జనాలను ప్రభావితం చేసేలా సామెతలు.. ఇటీవలి వరకు ప్రాంతీయ వాదం, సెంటిమెంట్ ను తెరపైకి తెచ్చేలా.. మరికొన్ని పదాలు.. ఇదీ కేసీఆర్ స్పీచ్ లో ఎక్కువగా ఉండేవి. అంటే.. 2001 నుంచి 2019 లోక్ సభ ఎన్నికలవరకు దాదాపు రెండు దశాబ్దాల పాటు బహిరంగసభల్లో కేసీఆర్ ప్రసంగ శైలి ఇదే. పదాలు వేరైనా..వేదికలు మారినా.. అర్థం, అంతరార్థం అదే. 2019 లోక్ సభ ఎన్నికల వరకు ఇదే పరిస్థితి. కాని GHMC ఎన్నికల బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగ తీరు మారింది.
2019 లోక్ సభ ఎన్నికల తరువాత మళ్లీ ఎన్నికలసభల్లో ఈ స్థాయిలో మాట్లాడడం ఇదే తొలిసారి. దుబ్బాకలో సభ ఉంటుందని భావించినా.. ఆ నియోజకవర్గ పరిధిలో జరగలేదు. మధ్యమధ్యలో ప్రెస్ మీట్ లు, పార్టీ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో మాట్లాడినా కేసీఆర్ కు ఆ స్థాయిలో ప్రసంగించే అవసరం రాలేదు. తాజాగా GHMC ఎన్నికల్లోనే కేసీఆర్ బహిరంగ సభకు వచ్చారు. ఆ సభలో కేంద్రంపై డైరెక్ట్ అటాక్ చేయగా.. కాంగ్రెస్ తోపాటు మిగతా పార్టీలను పేరెత్తకుండానే విమర్శించాడు. నన్ను ఢీకొట్టడానికి ఇంత మంది రావాలా అని ప్రశ్నించారు.
సాధారణంగా రెండు దశాబ్దాల పాటు కేసీఆర్ చేసిన ప్రసంగాలకు, GHMC ఎన్నికల సభలో కేసీఆర్ ప్రసంగానికి స్పష్టమైన తేడా కనిపించింది. ఆంధ్ర దొంగలు (అందరినీ కాదు.. కేవలం దోపిడీ దారులనే తాను దొంగలు అన్నానని గతంలో కేసీఆర్ చాలా సార్లు చెప్పారు) అనే పదం లేకుండా అంటే.. ప్రాంతీయ సెంటిమెంట్ లేకుండా ప్రసంగించారు. ఇందుకు చాలా కారణాలున్నాయి.
- 2018, 2019 ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్, టీజేఎస్ లు జత కట్టాయి. దీంతో అప్పట్లో ఆయనకు ఆ కోణంలో ప్రంసగించాల్సిన అవసరం ఏర్పడింది.
- ఇక ఆరేళ్లుగా తెలంగాణలో TRS ప్రభుత్వమే అధికారంలో ఉంది. హైదరాబాద్ లోనూ ఆ పార్టీ పాలకవర్గమే ఉంది.
- తెలుగుదేశం పార్టీ తన కేడర్ ను కాపాడుకునే యత్నంలో ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ కేవలం కాంగ్రెస్, బీజేపీలను మాత్రమే టార్గెట్ చేసినట్టు భావించవచ్చు.
- అందులోనూ బీజేపీ మత సెంటిమెంట్ ను వినియోగించుకుంటున్న నేపథ్యంలో కేసీఆర్ చాలా బ్యాలెన్సింగ్ గా ప్రసంగం చేశారు. అలాగని సున్నితమైన ప్రసంగం చేశారని చెప్పలేం. తన జోలికి వస్తే.. ఏ స్థాయివాడినైనా లెక్కచేయను..నేను తెలంగాణ బిడ్డను అనే రీతిలో ప్రసంగించారు. తాను తెలంగాణ బిడ్డను అని, వేరే రాష్ట్రాలనుంచి రాజకీయ నాయకులు వస్తారు..పోతారు.. ప్రజలకు అండగా ఉండేది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని వ్యాఖ్యానించారు కేసీఆర్.
నొప్పించకుండా..
2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొన్ని ప్రసంగాల్లో కేటీఆర్, కేసీఆర్ లు ‘ఇప్పుడే ఏర్పాటైన రాష్ట్రం.. పసిబిడ్డ లాంటి రాష్ట్రం.. మన రాష్ట్రం మన పాలనలోనే ఉండాలి’ అని పరోక్షంగా ఆంధ్ర రాజకీయనాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించినట్టు ప్రచారం జరిగింది. ఈ సారి కేవలం ధిల్లీనాయకులకు, తెలంగాణ బిడ్డకు జరుగుతున్న పోరుగా కేసీఆర్ అభివర్ణించారని చెప్పవచ్చు. టీఆర్ఎస్ తోనే హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. శాంతి భద్రతలు బాగుంటాయని, ఉద్యోగాలకు భద్రత ఉంటుందని, ఆస్తుల విలువ పడిపోకుండా ఉంటుందని వ్యాఖ్యానించారు. వీటితోపాటు కేంద్ర నిధులు ఇవ్వలేదని దుమ్మెత్తిపోసిన కేసీఆర్ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని పథకాలను కూడా ప్రస్తావించి.. ఓటర్లను ఆకర్షించే యత్నం చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. మనం అందరం తెలంగాణ వాళ్లం..నేనూ తెలంగాణ వాడిని..టీఆర్ఎస్ కు తెలంగాణ ప్రజానీకమే బాస్ లు అని చెప్పారు. మొత్తంమీద రెండుదశాబ్దాల పాటు ఆంధ్ర దోపిడీదార్ల చేతిలో నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాలన్న వాదన వినిపించిన కేసీఆర్ ఇప్పుడు ధిల్లీ పెత్తనం ఉండకూడదని చెప్పారు. అదే టైంలో అభివృద్ధి విషయంపై ప్రసంగించారు.