ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ నేతల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా డ్ర*గ్స్ అక్రమ రవాణా కేసులో వైసీపీకి కీలక నేత, కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి కేరళలో డ్ర*గ్స్ కేసులో అరెస్టవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులోకి ఇప్పుడు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ఎంట్రీ ఇవ్వడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది.
వైఎస్ఆర్సీపీ హయాంలో కాకినాడ కేంద్రంగా డ్ర*గ్స్ దందా సాగిందనే ఆరోపణలకు ఈ ఘటన మరింత బలాన్ని చేకూరుస్తోంది. ద్వారంపూడికి సంబంధించిన వ్యాపార లావాదేవీలు అన్నీ దగ్గరుండి చూసే మాజీ కార్పొరేటర్ రోకళ్ల సత్యనారాయణ..కొద్ది నెలల క్రితం కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్ర*గ్స్ తరలిస్తూ DRI అధికారులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కాడు. ఆయనతో పాటు రేచర్లపేటకు చెందిన పందిరి అరుణ్ కుమార్ కూడా ఉన్నారు. వీరి వద్ద సబ్బు బిళ్లల రూపంలో భద్రపరిచిన దాదాపు 3 కిలోల ఖరీదైన మాదకద్రవ్యాలు దొరికాయి. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో కోట్లలో ఉంటుందని అంచనా.
పట్టుబడిన సమయంలో సత్యనారాయణ తనను తాను గాయపరచుకుని డ్రామా ఆడగా, అధికారులు వెంటనే అతనికి వైద్య చికిత్స అందించిన అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది. అయితే అప్పట్లో ఈ భారీ కుంభకోణం బయటకు పొక్కకుండా వైసీపీ నాయకులు సర్వశక్తులు ఒడ్డి గోప్యంగా ఉంచడంలో జాగ్రత్తపడ్డారు.
ఈ ఘటన జరిగి ఐదు నెలలు గడుస్తున్నా తాజాగా ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో పాటు, మూడు రోజుల క్రితం DRI అధికారులు నేరుగా కాకినాడలోని సత్యనారాయణ నివాసానికి వచ్చి సోదాలు నిర్వహించారు. ఆయన ఆర్థిక లావాదేవీలను లోతుగా పరిశీలించిన అధికారులు, అక్రమ మార్గాల్లో వచ్చిన నగదుపై ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగానే సత్యనారాయణ బ్యాంకు ఖాతాలను కూడా అధికారులు సీజ్ చేసినట్లు సమాచారం.
కాకినాడ కేంద్రంగా సాగిన ఈ డ్ర*గ్స్ నెట్వర్క్ వెనుక అసలు మాస్టర్ మైండ్ ఎవరనే కోణంలో విచారణ జరపాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు డిమాండ్ చేశారు. ఈ మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డిని కూడా విచారిస్తేనే అసలు నిజాలు బయటికి వస్తాయని ఆయన స్పష్టం చేశారు.











