పరిపాలన అంటే కేవలం మైకుల ముందు మాట్లాడటం కాదు..ఇచ్చిన ప్రతీ మాటను అమలు చేసి చూపించడం అని ఏపీలోని కూటమి ప్రభుత్వం నిరూపిస్తోంది. చెప్పాం – చేస్తున్నాం అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, గడిచిన రెండున్నరేళ్ల పనితీరుతో మార్పును కళ్ళకు కడుతోంది. సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం అనే మూడింటిని సమాంతరంగా నడిపిస్తూ నవ్యాంధ్ర ప్రగతికి కొత్త బాటలు వేస్తోంది.
గడిచిన 2.5 సంవత్సరాల కాలాన్ని పరిశీలిస్తే..కూటమి ప్రభుత్వం ముందుగా దృష్టి పెట్టింది పేదలు, సామాన్యుల జీవితాల్లో భరోసా నింపడం పైనే. నెలాఖరు రాగానే పింఛన్ వస్తుందో రాదో అనే ఆందోళనకు తెరదించుతూ, ప్రతీ నెల మొదటి తారీఖునే క్రమం తప్పకుండా పింఛన్లు అందించే వ్యవస్థను తీసుకొచ్చారు. ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా అత్యధికంగా పింఛన్ల కోసం ఖర్చు పెడుతున్న రాష్ట్రంగా నిలిచింది. దీనికి తోడు, సామాన్యుడి ఆకలి తీర్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను పునరుద్ధరించి విజయవంతంగా నడుపుతున్నారు. రూపాయి ఖర్చు కాకుండా పేదలకు కడుపు నిండా పౌష్టికాహారం అందించడం ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజల ఆదరణను పొందుతున్నారు.
కేవలం సంక్షేమానికే పరిమితం కాకుండా, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు అవసరమైన మౌలిక వసతులపై కూటమి ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. జగన్ హయాంలో స్తంభించిన పారిశ్రామిక రంగానికి కొత్త ఊపిరి పోస్తూ, నూతన పారిశ్రామిక విధానాలతో గూగుల్ లాంటి MNC కంపెనీలను ఏపీకి తీసుకువస్తున్నారు. దీనివల్ల యువతకు స్థానికంగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. పల్లె పండుగలో భాగంగా రహదారుల పునర్నిర్మాణం, మరోవైపు రాజధాని అమరావతి పనుల్లో వేగం పెంచడం వంటి చర్యలతో రాష్ట్రాన్ని మళ్ళీ ఇన్వెస్టర్లకు హాట్ స్పాట్‌గా మార్చారు.
వ్యవసాయ రంగాన్ని నిలబెట్టేందుకు రైతాంగానికి సకాలంలో విత్తనాలు, ఎరువులు అందించడమే కాకుండా, పంట కొనుగోలు కేంద్రాల ద్వారా గిట్టుబాటు ధర దక్కేలా చర్యలు తీసుకున్నారు. అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఏటా ఆర్థిక సాయం అందజేస్తున్నారు. మహిళ సాధికారత దిశగా అడుగులు వేస్తూ, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం వంటి పథకాలతో వారికి ఆర్థికంగా పెద్ద ఊరటనిచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఇప్పటికే ఓ దఫా DSC పూర్తి చేయగా..మరోసారి DSC నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్లోనూ పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేశారు.
గడిచిన 2.5 ఏళ్లలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన నిర్ణయాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఓ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. హామీలు ఇచ్చి మర్చిపోవడం కాదు, ఇచ్చిన మాటను అమలు చేయడమే నిజమైన రాజధర్మమని ప్రభుత్వం చాటిచెబుతోంది. రానున్న రోజుల్లో కూడా ఇదే ఉత్సాహంతో రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలతో పనిచేస్తోంది.











