మోడల్ గా కెరీర్ ప్రారంభం, ఆ తర్వాత షార్ట్ ఫిలిమ్స్, ఇప్పుడు మలయాళంలో యువ సూపర్ స్టార్ ఈ మాటలు ఎవరి గురించి అంటే టోవినో థామస్ గురించి. 2012లో ‘ప్రభువింటే మక్కల్’ తో సినిమా రంగంలో అతని కెరీర్ ప్రారంభమైంది. ఇప్పుడతని రేంజ్ మారిపోయింది. యువతరంలో దూకుడు మీద ఉన్నాడు. ప్రాంతీయ భాషల్లో సూపర్ హీరోల సినిమాలు చాలా తక్కువ ఉన్నాయి. టోవినో థామస్ సూపర్ హీరోగా మారిపోయినట్టే. అదే మిన్నల్ మురళి సినిమా. మలయాళంలో రూపొందిన ఈ సినిమాని వివిధ భాషల్లో అందించేందుకు నెట్ ఫ్లిక్స్ ఏర్పాట్లు చేసింది. త్వరలో నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది.
ఓ మామూలు వ్యక్తి కొన్ని మెరుపుల తాకిడికి గురై అసాధారణ వ్యక్తిగా మారిపోయే కథ ఇది. ఒక విధంగా హిందీ క్రిష్ సినిమా తరహా కథ. లుక్ చూస్తే షాజమ్ ని గుర్తు చేస్తోంది. ముడుచుకున్న థోతి, ఎర్ర రంగు కండువా అతన్ని ముఖాన్ని కప్పే హీరో లుక్ ని విడుదల చేశారు. అతీంద్రియ శక్తులుండే ఈ పాత్రను టోవినో థామస్ ఫోషించాడు. తెలుగులో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. తాను మొదట్నుంచీ ఈ పాత్ర పోషణ మీద శ్రద్ధపెట్టినట్టు హీరో చెబుతున్నారు.డైరెక్టర్ బాసిల్ తో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చర్చించి నటించానని చెప్పారు. తాను హీరోగా చాలా విషయాలు నేర్చుకోడానికి కూడా ఈ సినిమా ఉపయోగపడిందన్నారు.
చిత్ర యూనిట్ అందరికీ ఇది డ్రీమ్ ప్రాజెక్ట్ అని దర్శకుడు జోసెఫ్ సిద్ధం చెబుతున్నారు. గురు సోమ సుందరం, హరిశ్రీ అశోకన్, అంజు వర్గీస్ ఇతర పాత్రల్ని పోషించారు. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ సినిమా విడుదలవుతోంది. దీని స్ట్రీమింగ్ తేదీని నెట్ ఫ్లిక్స్ ఇంకా ప్రకటించలేదు. ఈ వారంలోనే ఆ ప్రకటన కూడా రావచ్చు. నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఫిల్మ్స్ అండ్ లైసెన్సింగ్ డైరెక్టర్ ప్రతీక్షా రావు మాట్లాడుతూ అద్భుతమైన మేకింగ్ ఈ సినిమా ప్రత్యేకత అన్నారు. ఇంటిల్లి పాదీ అలరించేలా సినిమా ఉంటుందన్నారు. హృతిక్ క్రిష్ తర్వాత వచ్చే ఈ సూపర్ హీరో ఎలాంటి అద్భుతాలు చేస్తాడో చూడాలి.
Must Read ;- పాటతో భీమ్లా నాయక్ తొడగొట్టేశాడు











